Chandrababu: ఆ ఎంపీని చూస్తే దాదాపు కొట్టినంత పనిచేశాడు: చంద్రబాబు
- మంగళగిరిలో చంద్రబాబు మీడియా సమావేశం
- వైసీపీ ప్రభుత్వాన్ని తప్పుబట్టిన చంద్రబాబు
- కంపెనీలు వెనక్కి వెళ్లిపోతున్నాయని ఆవేదన
టీడీపీ అధినేత చంద్రబాబు మంగళగిరిలోని పార్టీ జాతీయ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రం నుంచి కంపెనీలను వెనక్కి తరిమేస్తున్నారని వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. విశాఖలో అదానీ డేటా సెంటర్ ఏర్పాటై ఉంటే లక్ష మందికి ఉద్యోగాల కల్పన జరిగేదని చెప్పారు. కానీ ఆ కంపెనీ కూడా వెనక్కి వెళ్లే పరిస్థితిని తీసుకువచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లులూ కంపెనీది కూడా ఇదే పరిస్థితని, లులూ కంపెనీ వచ్చుంటే వేలమందికి ఉపాధి కలిగేదని చెప్పారు. నీతి, నిజాయతీకి నిదర్శనంలాంటి సింగపూర్ ప్రభుత్వ సంస్థలపైనా ప్రైవేటు కంపెనీలంటూ ముద్రవేశారని ఆరోపించారు.
కియా మోటార్స్ సంగతి ఇంతకంటే భిన్నంగా ఏమీలేదని చంద్రబాబు చెప్పారు. కియా మోటార్స్ కు చెందిన 17 అనుబంధ సంస్థలు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయాయని వివరించారు. "మీ కక్కుర్తి అంతా కమిషన్ల కోసమే. ఆ రోజు చూశాను... ఓ ఎంపీ కియా ప్రతినిధిని దాదాపు కొట్టినంత పనిచేశాడు. వాళ్ల సెక్యూరిటీకి కూడా ప్రమాదం వాటిల్లే పరిస్థితి వచ్చింది. అక్కడ పెట్టుబడి పెట్టారు కాబట్టి వాళ్లు కొనసాగుతున్నారు. ఆ రోజు మహారాష్ట్ర పోటీకి వచ్చినా కియాను ఏపీకి తీసుకువచ్చాం. ఆరు నెలల్లో గొల్లపల్లి నుంచి కియాకు నీళ్లిచ్చాం. అక్కడివాళ్లు బాగుపడేసరికి మళ్లా వీళ్ల కన్ను పడింది. మొత్తం నాశనం అయింది. మీ వల్ల రూ.79 వేల కోట్లు వెనక్కివెళ్లిపోయాయి" అంటూ మండిపడ్డారు.