Amaravati: అమరావతికి మద్దతు.. హైదరాబాద్‌లో నిరసనల కోసం కోర్ కమిటీ!
- కూకట్‌పల్లిలోని బాలాజీ నగర్‌లో సమావేశం
- తరలివచ్చిన వందలాదిమంది
- నగర వ్యాప్తంగా ర్యాలీలు, నిరసనలు చేపట్టాలని నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి తరలింపును నిరసిస్తూ రాజధాని ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతు పెరుగుతోంది. రైతులకు అండగా నిలవాలని, వారికి మద్దతుగా హైదరాబాద్ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని కూకట్‌పల్లివాసులు నిర్ణయించారు. ఈ మేరకు బాలాజీనగర్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించి భవిష్యత్ ప్రణాళికను వెల్లడించారు.
ఈ సందర్భంగా ఇద్దరు న్యాయ సలహాదారులు, ఇద్దరు కోశాధికారులు, ఐదుగురు ముఖ్య సభ్యులతో ప్రత్యేకంగా కోర్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి వందలాదిమంది హాజరయ్యారు. రైతులకు మద్దతుగా నగరంలో వివిధ కార్యక్రమాలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు.
వారాంతాల్లో ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు, బైక్, కొవ్వొత్తుల ర్యాలీలు చేపట్టాలని, ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద.. అమరావతిపై వాహనదారులకు అవగాహన కల్పిస్తూ వారి మద్దతు కూడగట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్లకార్డులు చేతబట్టి ట్రాఫిక్ కూడళ్లలో నినాదాలు చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. త్వరలో లీగల్ కమిటీని ఏర్పాటు చేసి, వారి ఆధ్వర్యంలో అమరావతి వెళ్లి రైతులకు సంఘీభావం తెలపనున్నారు.