HD Kumaraswamy: కర్ణాటక ప్రజలను ఇక ఆ దేవుడే కాపాడాలి: మాజీ సీఎం కుమారస్వామి
- రైతులు, విద్యార్థులకు బడ్జెట్లో ఒరిగిందేమీ లేదు
- రాష్ట్ర నిధుల్లో భారీగా కోతేశారు
- మంత్రివర్గ విస్తరణ వారికి సాహసంగా మారింది
సమస్యలతో అల్లాడిపోతున్న కర్ణాటక ప్రజలను ఇక ఆ దేవుడే కాపాడాలని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి అన్నారు. కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి నిధుల కోతపై మాట్లాడిన ఆయన తీవ్ర విమర్శలు చేశారు. తాజా బడ్జెట్లో రాష్ట్ర పన్నుల వాటాలో కోతతోపాటు ఈ ఏడాది రూ.9-11 వేల కోట్లను తగ్గించిందన్నారు. గతేడాది ప్రకటించిన పథకాలకు సంబంధించి రూ. 30 వేల కోట్లకు గ్రాంట్లు తగ్గించినట్టు చెప్పారు.
బెళగావి వరద బాధితులకు రూ. 10 వేల చొప్పున ఇచ్చిన చెక్కులు డ్రా చేసుకోకుండా స్టే విధించడం దారుణమని కుమారస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు, యువతకు ఈ బడ్జెట్ నిరాశ మిగిల్చిందన్నారు. మంత్రి వర్గ విస్తరణపై మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వానికి మంత్రి వర్గ విస్తరణ ఓ సాహసంగా మారిందని కుమారస్వామి ఎద్దేవా చేశారు.