Vijay Sai Reddy: నేను చేసిన విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రకటన చేసింది: విజయసాయిరెడ్డి
- కేపీ ఉల్లి ఎగుమతులపై నిషేధం ఎత్తేయాలని రాజ్యసభలో కోరాను
- నిషేధం కారణంగా వేలాది రైతులు ఆవేదన చెందుతున్నారని చెప్పాను
- థ్యాంక్యూ పీయూష్ గోయల్ జీ.. సానుకూలంగా స్పందించారు
కేపీ ఉల్లి ఎగుమతుల నిషేధంపై తాను రాజ్యసభలో చేసిన విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం స్పందించిందంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. 'కేపీ ఉల్లి ఎగుమతులపై నిషేధం కారణంగా వేలాది రైతులు తాము పండించిన పంటను ఏం చేయాలో తెలియని అగమ్యగోచర స్థితిలో ఉన్నారు. నిషేధం తక్షణమే ఎత్తివేయాలని ఈ రోజు జీరో అవర్లో చేసిన విజ్ఞప్తిపై వాణిజ్య మంత్రి సానుకూలంగా స్పందించినందుకు ధన్యవాదాలు' అని తెలిపారు.
అనంతరం విజయసాయిరెడ్డి మరో ట్వీట్ చేసి... 'థ్యాంక్యూ పీయూష్ గోయల్ జీ.. రాజ్యసభలో నేను ఈ రోజు చేసిన విజ్ఞప్తికి వెంటనే సానుకూలంగా స్పందించారు. ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని రెండు రోజుల్లో ఎత్తేస్తామని చెప్పినందుకు సంతోషం. మీరు చేసిన ఈ ప్రకటన రైతులకు ఉపశమనం కలిగిస్తుంది' అని అన్నారు.