Jagan: అమరావతి ఇటు విజయవాడలోకీ రాదు.. అటు గుంటూరులోకీ రాదు!: రాజధాని రైతులతో సీఎం జగన్
- ఇక్కడ సరైన రోడ్లు, డ్రైనేజీలు, పైపు లైన్లు లేవు
- గత సర్కార్ అమరావతిలో ఖర్చు చేసింది రూ.5674 కోట్లే
- ఇంకా రూ.2,297 కోట్ల బకాయిలు చెల్లించాలి
అమరావతి అనేది ఇటు విజయవాడలోకీ రాదు, అటు గుంటూరులోకీ రాదని ఏపీ సీఎం జగన్ విమర్శించారు. రాజధాని అమరావతి గురించి తనను కలిసిన రైతులతో జగన్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. అమరావతి ప్రాంతంలో సరైన రోడ్లు, డ్రైనేజీలు, పైపు లైన్లు లేవని విమర్శించారట.
అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకు ఎకరానికి రూ.2 కోట్లు చొప్పున ఖర్చు చేయాలని, అందుకోసం లక్ష కోట్లకు పైనే ఖర్చవుతుందని గత ప్రభుత్వమే లెక్కకట్టిందని ప్రస్తావించినట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వం ఐదేళ్లలో అమరావతిలో ఖర్చు చేసింది రూ.5674 కోట్లే అని, ఇక్కడ చేసిన పనుల్లో ఇంకా రూ.2,297 కోట్ల బకాయిలు చెల్లించాలని వివరించినట్టు సంబంధిత వర్గాల సమాచారం.
లక్ష కోట్లు అవసరమైన చోట ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడమనేది సముద్రంలో నీటిబొట్టుతో సమానమని ముఖ్యమంత్రి అభివర్ణించారు. అమరావతిలోనే లెజిస్లేటివ్ క్యాపిటల్ కొనసాగుతుందని రైతులతో జగన్ మరోమారు చెప్పినట్టు సమాచారం.