Pawan Kalyan: పవన్ సినిమాల్లో నటిస్తూ.. రాజకీయాల్లో కొనసాగవచ్చు: పరుచూరి గోపాలకృష్ణ
- పవన్ సినిమాల్లోకి రావడం చాలామందికి ఇష్టమే..
- ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయినా కూడా సినిమాలు చేశారు
- ఎంజీఆర్ ఎమ్మెల్యేగా ఉండి సినిమాల్లో నటించారు
ఇక సినిమాల్లో నటించను అని చెప్పిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజాగా సినిమాల్లో నటించడానికి సిద్ధమవుతోండటంపై పలువురు పలు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. జనసేన అధినేతగా పవన్ కల్యాణ్ ఒకవైపు రాజకీయాల్లో క్రియాశీలంగా ఉంటూ.. ఇటీవల పింక్ రీమేక్ చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా క్రిష్, హరీశ్ శంకర్ సినిమాలకు ఒప్పుకున్నారు.
ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ‘పరుచూరి పలుకులు’ పేరుతో తాజాగా వీడియోను పోస్ట్ చేశారు. రాజకీయాల్లోకి వెళ్లినంత మాత్రాన మేకప్ వేసుకోవడం తప్పేమీ కాదన్నారు. పలువురు సినీ నటులు రాజకీయాల్లో ఉంటూనే నటిస్తున్నారన్నారు. పవన్ తిరిగి సినిమాల్లోకి రావడం చాలా మందికి ఇష్టమే అని అన్నారు.
‘నటన, రచన భగవంతుడిచ్చిన వరం. సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్నాం. సమాజంలో జరుగుతున్న అంశాలను తెరపై చూపిస్తుంటే అవి నచ్చి మమ్మల్ని ప్రేమిస్తున్నారు. నటులు ధరించే పాత్రలతో వారికి ఆ ఇమేజ్ వస్తుంది. కొందరినైతే ఆరాధిస్తున్నారు. పవన్ కల్యాణ్ కు ఇమేజ్ ఉంది.
ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయినా కూడా సినిమాలు చేశారు. 1989 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన తర్వాత 94 ఎన్నికల్లో గెలవడానికి మేజర్ చంద్రకాంత్ సినిమా ఎంత ఉపయోగపడిందో మాకు తెలుసు. ఎంజీఆర్ కూడా తాను ఎమ్మెల్యేగా గెలిచినా సినిమాలు మానేయలేదు. రేపు పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచినా నటిస్తూనే ఉండాలి. పవన్ మంచి మనస్సున్న మనిషి.
రామారావు 'నా దేశం' సినిమా చేయనన్నప్పుడు.. మీ పార్టీకి ఉపయోగపడుతుంది సార్ అని చెబితే.. నన్ను నమ్మి చేశారు. ఆ సందర్భంలో ఆయన నాతో.. ఈ సినిమా ఆడకపోయినా మాట్లాడను. నీ మీద ఆగ్రహం వ్యక్తం చేయను. కానీ నాకు చెడ్డపేరు వస్తే.. మాత్రం జీవితంలో మీతో మాట్లాడను అని షరతు పెట్టారు. సరే అన్న తర్వాత విగ్గు పెట్టుకున్నారు. ఆ తర్వాత అందులోని ఒక డైలాగు చదువుతూ, నన్ను ప్రేమ పూర్వకంగా చూశారు.
ఇప్పుడు పవన్ కు నేను చెప్పేది ఒక్కటే.. మీరు వీధి వీధి తిరిగి చెప్పేకంటే ఒక్క మీడియా ద్వారా, పాత్ర ద్వారా మీ మాటలు అద్భుతంగా ప్రజల్లోకి వెళ్లిపోతాయి. కర్తవ్యం చూసి చాలామంది మహిళలు పోలీస్ అధికారులు కావాలనుకున్నారు. సినిమా ప్రభావం అలాంటిది’ అని చెప్పారు.