Hyderabad: హైదరాబాద్ లో చేపల వ్యాపారి కిడ్నాప్.. దారుణ హత్య!
- ఈఎస్ఐ వద్ద కిడ్నాప్ చేసినట్టు గుర్తింపు
- రూ.90 లక్షలు డిమాండ్ చేసిన కిడ్నాపర్లు
- పోలీసుల అదుపులో నలుగురు నిందితులు
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ చేపల వ్యాపారిని కిడ్నాప్ చేసిన దుండగులు అతడిని దారుణంగా చంపేశారు. సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏజీ కాలనీలోని వికాశ్పురికి చెందిన పి.రమేశ్ (50) చేపల వ్యాపారి. ఈ నెల 1న ఇంటి నుంచి బయటకు వెళ్లిన అతడు రాత్రి తిరిగి రాలేదు. తర్వాతి రోజు ఉదయం రమేశ్ మొబైల్ ఫోన్ నుంచి అతడి కోడలికి మెసేజ్‌లు వచ్చాయి. మద్యం మత్తులో వాంతులు చేసుకున్నాడని, రాత్రికి ఇంటికి వస్తాడని, నిద్ర లేవగానే తీసుకొచ్చి దిగబెడతామన్నది వాటి సారాంశం. ఆ తర్వాత కాసేపటికే అతడి ఫోన్ స్విచ్ఛాఫ్ అయింది. కంగారుపడిన కుటుంబ సభ్యులు ఈ నెల 2న మధ్యాహ్నం ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
మూడో తేదీన రమేశ్ ఫోన్ నుంచి మరో మెసేజ్ వచ్చింది. అతడిని కిడ్నాప్ చేశామని, రూ.90 లక్షలు ఇవ్వాలని దుండగులు అందులో డిమాండ్ చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు రమేశ్‌ను ఈఎస్ఐ వద్ద కిడ్నాప్ చేసినట్టు గుర్తించారు. మరోవైపు, తన ఇంటిలో అద్దెకు ఇచ్చిన గది నుంచి దుర్వాసన వస్తుండడంతో జవహర్‌నగర్‌కు చెందిన శివరామ్ కుమార్ తాళం పగలగొట్టి లోపలికి వెళ్లి చూసి హతాశుడయ్యాడు. కాళ్లు, చేతులు కట్టేసి కుళ్లిన స్థితిలో ఉన్న ఓ మృతదేహం కనిపించింది. తేరుకున్న ఆయన వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడిని రమేశ్గా గుర్తించారు. అతడిని కిడ్నాప్ చేసిన వ్యక్తులే ఇక్కడికి తీసుకొచ్చి హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. కిడ్నాప్ చేసిన రోజునే అతడు హత్యకు గురై ఉంటాడని భావిస్తున్నారు. మృతదేహాన్ని పూడ్చివేసే ఉద్దేశంతో కాళ్లు, చేతులను వెనక్కి మడిచి కట్టారని పోలీసులు తెలిపారు. శివరామ్‌కుమార్ ఇంట్లో అద్దెకు ఉంటున్న శ్రీనివాస్, అరుణ, పిల్లలు పరారైనట్టు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేశామని, వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారని పోలీసులు తెలిపారు.