Union Government Jobs: ఎన్ని లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో లోక్ సభకు తెలిపిన ప్రభుత్వం!
- ఖాళీగా ఉన్న కేంద్ర ఉద్యోగాల సంఖ్య 6.83 లక్షలు
- త్వరలోనే 3,10,832 ఉద్యోగాల భర్తీ
- ఉద్యోగ నియామకాలు నిరంత ప్రక్రియ అన్ని జితేంద్ర సింగ్
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో 6.83 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈరోజు లోక్ సభలో వెల్లడించారు. 2018 మార్చ్ 1వ తేదీ నాటికి కేంద్రం పరిధిలో మొత్తం 38,02,779 ఉద్యోగాలు ఉండగా... ప్రస్తుతం 31,18,956 మంది ఉద్యోగులు విధుల్లో ఉన్నారని తెలిపారు. పదవీ విరమణ, రాజీనామా, మరణం, ప్రమోషన్ తదితర కారణాలతో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఈ ఖాళీలను సంబంధిత మంత్రిత్వ శాఖలు, విభాగాలు భర్తీ చేయాల్సి ఉందని తెలిపారు.
ఉద్యోగ నియామకాలు అనేది ఒక నిరంతర ప్రక్రియ అని జితేంద్ర సింగ్ చెప్పారు. 1,16,391 ఉద్యోగాల కోసం ఆర్ఆర్బీ, 13,995 ఉద్యోగాల కోసం ఎస్ఎస్సీ, 4,399 ఉద్యోగాల కోసం యూపీఎస్సీలు రెకమెండ్ చేశాయని వెల్లడించారు. వీటితో పాటు రక్షణ శాఖ, పోస్టల్ డిపార్ట్ మెంటులు కలిసి 3,10,832 ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నాయని తెలిపారు.