Galla Jayadev: లోక్ సభలో అమరావతిపై మాట్లాడిన గల్లా జయదేవ్.. అడ్డు తగిలిన వైసీపీ ఎంపీలు!
- లోక్ సభలో అమరావతి అంశం లేవనెత్తిన గల్లా
- జగన్ ను జాతీయ మీడియా తుగ్లక్ అని పేర్కొందని వెల్లడి
- మండిపడిన వైసీపీ ఎంపీలు
- సముదాయించేందుకు స్పీకర్ యత్నం
టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ లోక్ సభలో అమరావతి అంశంపై వాడీవేడి ప్రసంగం చేశారు. సభలో తనకు అవకాశం ఇచ్చిన పిదప ఆయన మాట్లాడుతూ, 2015లో ఏపీ రాజధానిగా అమరావతిని నోటిఫై చేస్తూ ఇచ్చిన జీవోలో రాజధాని అన్నారు తప్ప రాజధానులు అనలేదని స్పష్టం చేశారు. విభజన చట్టంలోనూ ఒక రాజధాని అనే పేర్కొన్నారని వివరించారు. కానీ ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకువచ్చిందని వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో కూడా వాళ్లు ఎక్కడా అమరావతిని మార్చుతామని చెప్పలేదని, వైసీపీ మేనిఫెస్టోలో మూడు రాజధానుల అంశం లేదని గుర్తు చేశారు.
అయితే ఈ దశలో స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ అసెంబ్లీలో తీసుకున్న నిర్ణయాన్ని పార్లమెంటులో ప్రశ్నించలేమన్న విషయాన్ని గౌరవ సభ్యుడు గుర్తించాలని హితవు పలికారు. ఈ దశలో పలుసార్లు వైసీపీ సభ్యులు గల్లా ప్రసంగానికి అడ్డుతగిలే ప్రయత్నం చేశారు. స్పీకర్ పదేపదే విజ్ఞప్తి చేసినా నందిగం సురేశ్ తదితరులు గల్లా ప్రసంగాన్ని అడ్డగించేందుకు ప్రయత్నించారు. అయితే గల్లా మాత్రం తన ప్రసంగాన్ని కొనసాగించారు.
'ది ఆర్గనైజర్' పత్రికలో జగన్ ను 'తుగ్లక్' అని పేర్కొన్నారని, మరికొన్ని ఇతర జాతీయ మీడియా కథనాల్లోనూ జగన్ ను అదే తీరులో విమర్శించారని చెబుతుండగా, వైసీపీ ఎంపీలు తీవ్ర ఆగ్రహావేశాలతో పైకి లేచి అభ్యంతరం చెప్పారు. దాంతో స్పీకర్ వారిని సముదాయిస్తూ, ఆ వ్యాఖ్యలు రికార్డుల్లోకెక్కవని చెప్పారు.