Nirbhaya: నిర్భయ కేసు: హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించిన కేంద్రం
- ఉరి అమలుపై స్టేని ఎత్తివేయలేమన్న హైకోర్టు
- కేంద్రం పిటిషన్ కొట్టివేత
- సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం
నిర్భయ దోషుల ఉరితీతపై స్టేను ఎత్తివేయలేమంటూ ఢిల్లీ హైకోర్టు పేర్కొనడాన్ని కేంద్రం సుప్రీంకోర్టులో తేల్చుకోవాలని నిర్ణయించుకుంది. స్టే ఎత్తివేత కోరుతూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేయడం తెలిసిందే. అటు ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ కు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. దాంతో, కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్లు వేశాయి.
అంతకుముందు, నిర్భయ దోషుల కేసు విచారణలో ట్రయల్ కోర్టు రెండు సార్లు డెత్ వారెంట్ జారీచేసింది. రెండోసారి జారీ చేసిన డెత్ వారెంట్ కూడా వాయిదా పడడంతో కేంద్రం స్పందించింది. ఉరి అమలుపై స్టే ఎత్తివేయాలని ఓ పిటిషన్ లో కోరింది. అయితే, దోషులకు న్యాయపరమైన హక్కులు వినియోగించుకునేందుకు వారం సమయం ఉందని, ఆ తర్వాత కేసుపై విచారణ జరపుతామని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం సుప్రీంను ఆశ్రయించింది.
వాస్తవానికి నిర్భయ దోషుల ఉరి జనవరి 22న అమలు జరగాల్సి ఉండగా, దోషుల్లో ఒకడైన ముఖేశ్ కుమార్ క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేయడంతో అప్పటికి శిక్ష అమలు వాయిదా పడింది. ఆ తర్వాత ఉరి అమలు తేదీని ఫిబ్రవరి 1కి మార్చారు. దాంతో దోషులు తమకింకా న్యాయపరమైన అవకాశాలు ఉన్నాయంటూ పిటిషన్ దాఖలు చేయడంతో ఆ తేదీ కూడా వాయిదా పడింది.