Nara Lokesh: స్థానిక సంస్థల ఎన్నికల్లో మా నినాదం అదే: స్పష్టం చేసిన లోకేశ్
- ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని నినాదంతోనే ఎన్నికలకు
- నాడు మాట తప్పం-మడమ తిప్పం అన్నవారు ఎక్కడ?
- వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే మూడు రాజధానులు
రాజధాని విషయంలో తమది ఎప్పుడూ ఒకే మాటని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో విలేకరులతో మాట్లాడిన ఆయన పరోక్షంగా జగన్‌పై ఆరోపణలు చేశారు. అప్పట్లో అమరావతికి మద్దతు తెలిపి మాట తప్పం, మడమ తిప్పం అన్నవారు నేడు ఏమైపోయారని ప్రశ్నించారు. ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిందని ఆరోపించారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము ‘ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని’ నినాదంతోనే ముందుకు వెళ్తామని లోకేశ్ స్పష్టం చేశారు.
అంతకుముందు సందిరెడ్డి శేఖర్ అనే దివ్యాంగుడికి పెన్షన్ తీసివేశారంటూ జగన్ ప్రభుత్వంపై లోకేశ్ ట్విట్టర్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను విన్నాను, నేను ఉన్నాను అని డైలాగ్స్ కొట్టిన జగన్‌కు దివ్యాంగుల పెన్షన్లు ఎత్తివేయడం సిగ్గనిపించలేదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో తొలగించిన 7 లక్షల పెన్షన్లను పునరుద్ధరించాలని, లేకుంటే మరో ఉద్యమం తప్పదని లోకేశ్ స్పష్టం చేశారు.