fish merchant: చేపల వ్యాపారి హత్య వెనక లఘుచిత్ర దర్శకుడు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు!
- గతంలో రమేశ్ ఇంట్లో ఐదేళ్లపాటు ఉన్న నిందితుడు
- ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండడంతో డబ్బులు గుంజే ప్లాన్
- ప్రణాళికలో భాగంగా నెల రోజుల క్రితం జవహర్‌నగర్‌కు
హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలో దారుణహత్యకు గురైన చేపల వ్యాపారి రమేశ్ హత్యకేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన హత్య వెనక అనంతపురం జిల్లా కదిరికి చెందిన లఘుచిత్ర దర్శకుడు రాజునాయక్ అలియాస్ రిజ్వాన్ అలియాస్ శ్రీనివాస్ ఉన్నట్టు పోలీసులు తేల్చారు.
గతంలో రమేశ్ ఇంట్లో ఐదేళ్లపాటు అద్దెకు ఉన్న రాజునాయక్ డబ్బుల కోసమే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తేల్చారు. రమేశ్ ఇంట్లో అద్దెకు ఉన్న తర్వాత మల్కాజిగిరికి మకాం మార్చిన నిందితుడు రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆర్థికంగా ఇబ్బందుల పాలయ్యాడు. రమేశ్ వద్ద డబ్బులు పుష్కలంగా ఉన్నట్టు గుర్తించిన రాజునాయక్ అతడి నుంచి ఎలాగైనా డబ్బులు రాబట్టాలని పథకం పన్నాడు.
ప్రణాళికలో భాగంగా నెల రోజుల క్రితం ఓ మహిళ, ఇద్దరు పిల్లలతో కలిసి జవహర్‌నగర్‌లో ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. గత నెల 26న మహిళను ఎరగా వేసి డబ్బులు గుంజేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. ఆ తర్వాత ఈ నెల 1న రమేశ్‌కు ఫోన్ చేసి అదే ప్లాన్ అమలు చేసి అతడిని తన గదికి రప్పించాడు. నిద్రమాత్రలు కలిపిన మద్యం తాగించి ఆభరణాలను తీసుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో తలపై సుత్తితో బలంగా కొట్టడంతో రమేశ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.
అనంతరం అతడి వద్ద ఉన్న ఆభరణాలను తీసుకుని మల్కాజిగిరిలోని తన ఇంటికి వెళ్లిపోయాడు. అక్కడ ఆ నగలను ముత్తూట్ ఫైనాన్స్‌లో తాకట్టుపెట్టాడు. వచ్చిన డబ్బులతో అప్పటికే తాకట్టులో ఉన్న తన భార్య నగలను తీసుకున్నాడు. మరికొంత సొమ్మును తన వద్దే పెట్టుకున్నాడు.
ఆ తర్వాత రమేశ్ ఫోన్ నుంచి అతడి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి.. రమేశ్‌ను కిడ్నాప్ చేశామని, విడిచిపెట్టాలంటే రూ.90 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అప్పటికే రమేశ్ అదృశ్యంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి ఆటకట్టించారు. రూ. 90 లక్షలు ఇవ్వలేమని, రూ. 20 లక్షలు అయితే ఇవ్వగలమని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపారు. దీనికి సరేనన్న రాజునాయక్ బోరబండ చౌరస్తా వద్ద తీసుకుంటానని చెప్పాడు. తమ ట్రాప్‌లో పడిన రాజునాయక్ మల్కాజిగిరిలో ఉన్నట్టు తెలుసుకున్న పోలీసులు నిందితుడితోపాటు మహిళను అదుపులోకి తీసుకున్నారు.