Hajipur Rape: హాజీపూర్ వరుస హత్యాచారాల కేసుల్లో.. దోషి శ్రీనివాస్ రెడ్డికి ఉరిశిక్ష!
- మూడు కేసుల్లో వేర్వేరుగా తీర్పునిచ్చిన ఫోక్సో కోర్టు
- రెండు కేసుల్లో ఉరిశిక్ష, ఒక కేసులో జీవిత ఖైదు
- 101 సాక్షులను విచారించిన ఫోక్సో కోర్టు
తెలంగాణలో సంచలనం సృష్టించిన హాజీపూర్ వరుస హత్యాచారాల కేసుల్లో దోషిగా తేలిన శ్రీనివాస్ రెడ్డికి నల్గొండలోని ఫోక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉరిశిక్ష విధించింది. ముగ్గురు బాలికలపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు నిర్ధారణ జరిగింది. మూడు కేసుల్లో శ్రీనివాస్ రెడ్డి దోషిగా తేలాడని కోర్టు పేర్కొంది. దోషిని చనిపోయే వరకు ఉరితీయాలని వాదించిన ప్రాసిక్యూషన్ వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు. మూడు నెలలపాటు కోర్టు ఈ కేసులపై విచారణ జరిపింది. కేసులో ఫోరెన్సిక్ నివేదిక కీలకంగా మారింది. విచారణలో భాగంగా కోర్టు 101 మంది సాక్షులను విచారించింది.
మూడు కేసుల్లో వేర్వేరుగా కోర్టు తీర్పు వెలువరించింది. శ్రావణి, కల్పన కేసులో ఉరిశిక్ష విధించగా, మనీషా కేసులో జీవిత ఖైదును ఖరారు చేసింది. ఈ శిక్షలను దోషికి ఏకకాలంలో అమలు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఎఫ్ఐఆర్ నెం.110, 109 కేసుల్లో దోషికి ఉరిశిక్ష విధించింది. బాలికల్లో ఇద్దరిది బొమ్మల రామారం మండలం హాజీపూర్ కాగా, మరొక బాలికది మైశిరెడ్డి పల్లి. 2017లో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థినిని, 2019 ఫిబ్రవరిలో డిగ్రీ చదివే విద్యార్థినిని, అదే సంవత్సరం ఏప్రిల్ లో మరో పాఠశాల విద్యార్థినిని అత్యాచారం చేసి చంపేశాడని కోర్టు నిర్ధారించింది.
కేసు పూర్వాపరాలలోకి వెళితే, గత ఏడాది ఏప్రిల్ 22న ఓ పదో తరగతి బాలిక పాఠశాలకు వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. బాలిక ఆచూకీ కోసం విచారణ చేపట్టిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. లిఫ్ట్ ఇస్తానని చెప్పి బాలికను అత్యచారం చేసి శ్రీనివాస్ రెడ్డి చంపివేసినట్లు నిర్ధారణకు వచ్చారు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు గతంలో అదృశ్యమైన విద్యార్థినులకు సంబంధించిన నిజాలు కూడా బయటకు వచ్చాయి. వారికి లిఫ్ట్ ఇస్తానని చెప్పి అత్యాచారం చేసి హత్యచేసినట్లు విచారణలో శ్రీనివాస్ రెడ్డి ఒప్పుకున్నాడు. ఈ వరుస హత్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగడంతో ఫోక్సో కోర్టును ప్రభుత్వం ఏర్పాటు చేసి కేసుల విచారణ జరిపించింది. కాగా, దోషికి ఉరి శిక్ష విధించడం పట్ల బాధిత కుటుంబాలు హర్షం వ్యక్తం చేశాయి.