pratti pati: ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు ప్రత్తిపాటి శరత్ కార్యాలయంలో ఐటీ అధికారుల సోదాలు
- ఆవేక్సా కార్పొరేషన్ సంస్థలో ఐటీ అధికారుల సోదాలు
- పెండ్యాల శ్రీనివాసరావు నివాసంలోనూ రెండో రోజు తనిఖీలు
- మరికొందరు టీడీపీ మద్దతుదారుల కార్యాలయాల్లోనూ సోదాలు
టీడీపీ నేతల ఇళ్లు, కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ దాడులు కొనసాగుతున్నాయి. నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి మాజీ వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాసరావు నివాసంలో అధికారులు సోదాలు చేసిన విషయం తెలిసిందే. ఈ రోజు కూడా సోదాలు కొనసాగుతున్నాయి. మరోవైపు, హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు ప్రత్తిపాటి శరత్‌కు ఐటీ అధికారులు షాక్ ఇచ్చారు.
ఆయనకు చెందిన ఆవేక్సా కార్పొరేషన్ సంస్థలో ఐటీ అధికారులు సోదాలు చేపడుతున్నారు. మరోపక్క, మాదాపూర్‌లోని డీఎన్సీ ఇన్ఫ్రా సంస్థ డైరెక్టర్‌ను అరెస్ట్ చేసినట్టు డైరెక్టరేట్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) తెలిపింది. ఆ కంపెనీ యాజమాని నరేన్ చౌదరికి, టీడీపీ నేతలకు సన్నిహిత సంబంధాలున్నట్లు సమాచారం. కిలారి రాజేశ్‌కు చెందిన రెండు ఇన్ఫ్రా కంపెనీల్లోనూ ఆదాయపన్ను శాఖ సోదాలు కొనసాగుతున్నాయి. అలాగే, టీడీపీ కడప జిల్లా అధ్యక్షుడు రెడ్డెప్పగారి శ్రీనివాసులరెడ్డికి చెందిన హైదరాబాద్‌లోని కార్యాలయంలో ఐటీ సోదాల్లో కీలకపత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.