Chandrababu: గాలి ముద్దుకృష్ణమ నాయుడు ద్వితీయ వర్ధంతి సందర్భంగా చంద్రబాబు నివాళి
- అధ్యాపక వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చిన నేత
- ఆయన సేవలు చిరస్మరణీయమన్న చంద్రబాబు
- 2018 ఫిబ్రవరి 7న మృతి చెందిన ముద్దుకృష్ణమ నాయుడు
దివంగత టీడీపీ నేత, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు ద్వితీయ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనను స్మరించుకున్నారు. ఆయనకు నివాళి అర్పించారు. 'ఎన్టీఆర్ ఆశయాలకు ప్రభావితులై అధ్యాపక వృత్తి నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించిన సీనియర్ నేత స్వర్గీయ గాలి ముద్దుకృష్ణమ నాయుడుగారు. శాసనసభ సభ్యుడిగా, మంత్రిగా, శాసనమండలి సభ్యుడిగా ప్రజలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. ఈరోజు ఆయన ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఆ ప్రజానేత స్మృతికి నివాళులు' అని ట్వీట్ చేశారు.
2018 ఫిబ్రవరి 7న 70 ఏళ్ల వయసులో అనారోగ్య కారణాలతో ముద్దుకృష్ణమ నాయుడు మృతి చెందారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పుత్తూరు నియోజకవర్గం నుంచి ఆరు సార్లు, నగరి నియోజకవర్గం నుంచి ఒకసారి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. విద్య, అటవీశాఖ, ఉన్నత విద్య మంత్రిగా బాధ్యతలను నిర్వర్తించారు.