Girl: బాలిక అపహరణ.. రెండు గంటల్లోనే ఛేదించిన హైదరాబాద్ పోలీసులు
- రెండేళ్ల చిన్నారిని అపహరించిన ఆటో డ్రైవర్
- శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలిక తండ్రి
- క్షణం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగిన పోలీసులు
హైదరాబాద్ పోలీసుల సామర్థ్యం ఏమిటో తెలియజేసే మరో ఉదాహరణ ఇది. అపహరణకు గురైన ఓ బాలికను కేవలం రెండు గంటల్లోనే తల్లి చెంతకు చేర్చి పోలీసులు శభాష్ అనిపించుకున్నారు. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ శివార్లలోని తొండపల్లిలో సోను కుమార్ అనే వ్యక్తి ఇటుకల బట్టీలో పని చేస్తున్నాడు. నిన్న ఉదయం 9.30 గంటల సమయంలో ఇటుకల బట్టీ వద్ద ఆడుకుంటున్న తన రెండేళ్ల కుమార్తె కనిపించకుండా పోయింది. దీంతో, 10.20 గంటలకు శంషాబాద్ పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశాడు.
ఫిర్యాదు అందిన వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా పోలీసులు రంగంలోకి దిగారు. ఒక ఆటో డ్రైవర్ బాలికను అపహరించాడని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఆ ప్రాంతంలో బాటిల్స్, చెత్తను ఆటోలో తరలించే వ్యక్తి బాలికను కిడ్నాప్ చేశాడనే అంచనాకు వచ్చిన పోలీసులు... సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఆటో రిజిస్ట్రేషన్ నంబరును గుర్తించారు. నంబర్ ఆధారంగా ఆటో యజమాని వివరాలను సేకరించి వెంటనే అతనికి ఫోన్ చేశారు. వెంటనే ఆటో యజమాని శంషాబాద్ ప్రాంతంలో రాళ్లగూడలో ఉంటున్న సందీప్ (మహారాష్ట్రకు చెందిన వ్యక్తి) గుడిసె వద్దకు పోలీసులను తీసుకెళ్లాడు.
గుడిసెలోకి వెళ్లిన పోలీసులకు సందీప్ కిడ్నాప్ చేసిన చిన్నారి నిద్రిస్తూ కనిపించింది. వెంటనే అతనిని పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్నారిని ఆమె తల్లి చేతిలో పెట్టారు. ఈ కిడ్నాప్ ను ఛేదించడానికి పోలీసులు తీసుకున్న సమయం కేవలం రెండు గంటలు మాత్రమే.
ఈ సందర్భంగా ఏసీపీ అశోక్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, కిడ్నాపర్ సందీప్ తమను పక్కదోవ పట్టించేందుకు యత్నించాడని తెలిపారు. బాలిక రోడ్డుపై ఒంటరిగా ఉండడంతో, ఆమెను తీసుకొచ్చానని చెప్పాడన్నారు. అయితే బాలిక ఒంటరిగా కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని ఏసీపీ చెప్పారు. సందీప్ ను అరెస్ట్ చేశామని తెలిపారు. మరోవైపు, సందీప్ కు పెళ్లి అయింది. కానీ, ఆ దంపతులకు పిల్లలు లేకపోవడం గమనార్హం.