China: చైనాలో 'సామాజిక' ఉద్యమంగా రూపుదాల్చుతున్న వైద్యుడి మృతి ఘటన
- కొన్నివారాల కిందటే వైరస్ మహమ్మారిని గుర్తించిన చైనా డాక్టర్
- సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో నిర్బంధించిన పోలీసులు
- కరోనా బారినపడి మృతిచెందిన వైద్యుడు
- చైనా యువత ఆగ్రహం
సార్స్ వంటి మహమ్మారి విజృంభించబోతోందని, అందరూ అప్రమత్తంగా ఉండాలంటూ కరోనా వైరస్ పై మొట్టమొదట స్పందించిన చైనా కంటి వైద్యుడు లీ వెన్ లియాంగ్ తానే కరోనాకు బలైన సంగతి తెలిసిందే. అయితే, డాక్టర్ వెన్ లియాంగ్ ఈ వైరస్ గురించి ఎవరికీ తెలియని సమయంలోనే సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో పోలీసులు తీవ్రంగా పరిగణించి ఆయన్ను నిర్బంధంలోకి తీసుకున్నారు. ఇప్పుడాయన మృతితో చైనాలో ఆగ్రహ జ్వాలలు రేగుతున్నాయి. ఓ సంక్షోభాన్ని ఎదుర్కొనే విధానం ఇదేనా అంటూ చైనీయులు అక్కడి వామపక్ష ప్రభుత్వంపై మండిపడుతున్నారు.
అభిప్రాయాలను ఒకరితో ఒకరు పంచుకునేలా మరింత స్వేచ్ఛ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు, డాక్టర్ లీ వెన్ లియాంగ్ ను సోషల్ మీడియాలో ఓ హీరోలా కీర్తిస్తున్నారు. మరింత వాక్ స్వాతంత్ర్యం కావాలంటూ సామాజిక మాధ్యమాలను అక్కడి యువత హోరెత్తిస్తోంది. నిఘాలు, నిబంధనలతో కూడిన ఇది కూడా స్వేచ్ఛ అనిపించుకుంటుందా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.