Hero Vijay: హీరో విజయ్ నటిస్తున్న ‘మాస్టర్’ సినిమా షూటింగ్ ను అడ్డుకున్న బీజేపీ నేతలు
- గనుల్లో షూటింగ్ కు ఎలా అనుమతిస్తారంటూ నిరసన
- విజయ్ అభిమానులు, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
- ఈ నేపథ్యంలో విజయ్ ఇంటివద్ద భారీ బందోబస్తు
తమిళనాట ప్రముఖ హీరో విజయ్ ఆస్తులపై ఐటీ దాడులు ఆయన అభిమానుల్లో కలకలం రేపుతున్నాయి. మరోపక్క విజయ్ నైవేలి లిగ్నైట్ సంస్థలో జరుగుతున్న ‘మాస్టర్’ చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నారు. బొగ్గు గనుల్లో చిత్రం షూటింగ్ ను ఎలా చేస్తారంటూ బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో విజయ్ అభిమానులు, బీజేపీ కార్యకర్తల నడుమ ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు.
ఇదిలావుండగా, విజయ్ నటిస్తున్న ‘‘మాస్టర్’ చిత్ర నిర్మాత ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. విజయ్ ఆస్తులపై జరుగుతున్న దాడులు ఆయనను వేధించేందుకే జరుగుతున్నాయన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. విజయ్ తీసిన మెర్సల్, బిగిల్ చిత్రాలు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే విధంగా ఉన్నాయని బీజేపీ భావిస్తోందని సమాచారం.
తాజాగా ఈ రోజు నైవేలి లిగ్నైట్ సంస్థలో జరుగుతున్న మాస్టర్ చిత్రం షూటింగ్ లో విజయ్ పాల్గొంటున్న సమయంలో ఐటీ శాఖ తనిఖీలు చేపట్టింది. షూటింగ్ ప్రాంతంలోనే విజయ్ ను అధికారులు ప్రశ్నించారు. మూడు రోజులుగా చెన్నైలో ప్రముఖుల ఇళ్లపై ఐటీ శాఖ దాడులు చేస్తోన్న విషయం తెలిసిందే. ప్రత్యేకించి తమిళ చిత్ర సీమలో పేరుమోసిన నటులు, నిర్మాతల ఇళ్లపై దాడులు కొనసాగుతున్నాయి.
చెన్నైలోని ఫైనాన్షియర్ అన్బు చెలియన్ నివాసం, ఏజీఎస్ కార్యాలయంలో ఐటీ శాఖ తనిఖీలు చేపట్టింది. అన్బు చెలియన్ నివాసంలో రూ.77 కోట్ల అక్రమ నగదును గుర్తించారు. ఏజీఎస్ కార్యాలయం నుంచి రూ.300 కోట్లకు పైగా నగదు లావాదేవీల పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.