New Delhi: ఢిల్లీ ఓటర్లకు ఉచిత ఆఫర్లు ప్రకటించిన రవాణా సంస్థలు!

  • పోలింగ్‌ సందర్భంగా బైక్, బస్సు, విమానయాన సంస్థల ప్రకటన
  • రాపిడో, అభీబస్‌ డాట్‌కాం ఉచిత సేవలు
  • బేస్‌ టికెట్‌ చార్జి తిరిగిస్తామన్న స్పైస్‌జెట్‌

ఎన్నికల వేళ తాయిలాలు ప్రకటించడం రాజకీయ పార్టీలకు కొత్తకాదు. ఓటర్లను బూత్‌ వరకు తీసుకువెళ్లేందుకు రకరకాల సదుపాయాలు కల్పిస్తుంటాయి. ఎన్నికల కమిషన్‌ ఎలాగూ కొన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది. అయితే దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల సందర్భంగా ఈసారి భిన్నమైన పరిస్థితి కనిపించింది. ఈరోజు పోలింగ్‌ సందర్భంగా పలు సంస్థలు ఓటర్లకు ఉచిత రవాణా సదుపాయం ఆఫర్‌ చేయడం విశేషం.

ఇందులో ఆటోలు, బైక్‌లే కాదు స్పైస్‌ జెట్‌ విమానయాన సంస్థ కూడా ఉచిత సర్వీస్‌ అందిస్తానంది. బైక్-టాక్సీ బుకింగ్ యాప్ ‘రాపిడో’ ఈరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఢిల్లీ ఓటర్లకు మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న పోలింగ్ బూత్ వరకూ ఫ్రీ రైడింగ్ అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపింది.

అదేవిధంగా ‘అభీ బస్ డాట్ కామ్’ కూడా ‘ఐ ఓట్ ఐ విన్’ అనే నినాదంతో ఉచిత బస్సు సేవలకు ముందుకు వచ్చింది. ఎయిర్ లైన్స్ కంపెనీ  స్పైస్‌ జెట్‌ ఈరోజు ఢిల్లీ వచ్చేవారు, తిరిగి ఇదే రోజు వెళ్లిపోతే రానుపోను టిక్కెట్లపై  బేస్ చార్జీని వాపసు ఇవ్వనున్నట్లు తెలిపింది.

  • Loading...

More Telugu News