G Jagadish Reddy: సీఎం కేసీఆర్ పథకాల గురించి గుజరాత్ లో కూడా చర్చించుకుంటున్నారు: మంత్రి జగదీశ్ రెడ్డి
- కేసీఆర్ పథకాలతో మోదీ భయపడుతున్నారు
- తెలంగాణ ఇవ్వడమే అన్యాయమన్న రీతిలో మాట్లాడుతున్నారు
- మూడేళ్లకే రైతులకు 24 గంటల విద్యుత్ ఇస్తున్నాం
- మోదీ 15 ఏళ్లు గుజరాత్ సీఎంగా ఉండీ... చేయలేకపోయారు
తెలంగాణలో సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ముందుకు దూసుకుపోతూండటంతో ప్రధాని మోదీకి భయం పట్టుకుందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. తెలంగాణపై పార్లమెంట్ లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్లమెంట్ తలుపులు మూసి తెలంగాణను ప్రకటించారని మోదీ విమర్శించిన సంగతి తెలిసిందే.
ఈ రోజు సూర్యాపేటలో జరిగిన ఓ కార్యక్రమంలో జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలు గుజరాత్ సహా, దేశ వ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయన్నారు. కొత్త రాష్ట్రం తెలంగాణలో మూడేళ్లకే రైతులకు 24 గంటల విద్యుత్ ఇస్తూంటే.. ఆరేళ్ల నుంచి ప్రధానిగా, పదిహేనేళ్లు గుజరాత్ సీఎంగా ఉన్న మోదీ ఆ రాష్ట్రంలో ఆ పని ఎందుకు చేయలేకపోయారో అని ప్రశ్నించారు. సందర్భం లేకున్నా తెలంగాణ ఇవ్వడమే అన్యాయమన్న రీతిలో మోదీ పార్లమెంటులో మాట్లాడుతున్నారని మంత్రి విమర్శించారు.