Gopal: అపారమైన మేధ ఆ యువకుడి సొంతం... మాతృదేశానికే సేవలందిస్తానంటూ నాసా ఆఫర్ తిరస్కరణ
- 19 ఏళ్లకే శాస్త్రవిజ్ఞాన ఆవిష్కరణలు
- నాసా, ట్రంప్ ఆహ్వానాలు
- విదేశీ ఆఫర్లను తిరస్కరించిన బీహార్ యువకుడు
సాధారణంగా 19 ఏళ్ల వయసులో కుర్రాళ్లు డిగ్రీనో, ఇంజినీరింగో చదువుతుంటారు. కానీ ఈ బీహార్ కుర్రాడు మాత్రం టీనేజ్ లో ఉండగానే అనేక ఆవిష్కరణలకు తన పేరిట పేటెంట్లు సొంతం చేసుకుని శాస్త్రవిజ్ఞాన ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. అతని పేరు గోపాల్. ప్రస్తుతం డెహ్రాడూన్ లో బీటెక్ చదువుతున్నాడు. బీహార్ లోని భాగల్పూర్ జిల్లా ధ్రువ్ గంజ్ కు చెందిన గోపాల్ పేదకుటుంబంలో పుట్టినా చదువులో ముందుండేవాడు. టెన్త్ క్లాస్ లో ఉండగానే ఇన్ స్పైర్ పురస్కారం సొంతం చేసుకున్నాడు.
అరటితో ప్రయోగాలు, పేపర్ బయోసెల్స్ అంశాల్లో పేటెంట్లు పొందాడు. అహ్మదాబాద్ లోని నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ గోపాల్ ను మరింత ప్రోత్సహించింది. దాంతో మరికొన్ని ఆవిష్కరణలను తన పేరిట లిఖించుకున్నాడు. ఈ క్రమంలో గోపాల్ కు నాసా నుంచి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఆహ్వానాలు అందాయి. అయితే మాతృదేశమే మిన్న అని భావించిన ఈ బీహార్ యువకుడు తన సేవలు భారత్ కే అందిస్తానని విదేశీ ఆఫర్లు తిరస్కరించాడు. ప్రస్తుతం గోపాల్ దేశభక్తి సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది.