Vijay: తమిళ హీరో విజయ్ షూటింగ్ ను అడ్డుకున్న బీజేపీ... ఫ్యాన్స్ రావడంతో రచ్చ రచ్చ!
- ఐటీ దాడుల అనంతరం తిరిగి షూటింగ్ లో విజయ్
- బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారని తెలిసి అభిమానుల గొడవ
- ఇరు వర్గాలనూ చెదరగొట్టిన పోలీసులు
తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం 'మాస్టర్' షూటింగ్ నైవేలీలోని ఎన్ఎల్సీ సొరంగం వద్ద జరుగుతున్న వేళ, దాన్ని అడ్డుకునేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించడం, విషయం తెలిసి, విజయ్ అభిమానులు వారిని అడ్డుకోవడంతో ఆ ప్రాంతమంతా రచ్చరచ్చగా మారింది. ఇటీవలే ఐటీ విచారణను విజయ్ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. రెండు రోజుల విచారణ తరువాత, శుక్రవారం నుంచి విజయ్ షూటింగ్ ను తిరిగి ప్రారంభించాడు.
ఈ క్రమంలో ఎన్ఎల్సీ సొరంగం వద్ద షూటింగ్ ను వ్యతిరేకించిన బీజేపీ కార్యకర్తలు కొందరు, ఆ ప్రాంతానికి వచ్చి చిత్ర యూనిట్ తో వాగ్వాదానికి దిగారు. ఈ విషయం తెలుసుకున్న విజయ్ ఫ్యాన్స్ భారీ సంఖ్యలో అక్కడకు చేరుకోవడంతో పెద్ద గొడవే జరిగింది. యూనిట్ ఫిర్యాదు మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు, ఇరు వర్గాలనూ చెదరగొట్టారు. సినిమా షూటింగ్ జరుగుతున్న ప్రాంతంలో భద్రతను పెంచారు.
కాగా, 'బిగిల్' సినిమాకు సంబంధించిన పారితోషికం, సినిమా కలెక్షన్ల విషయంలో రెండు రోజుల పాటు ఐటీ అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. సినిమా ఫైనాన్షియర్ అన్బు చెలియన్ ఇల్లు, కార్యాలయంతో పాటు విజయ్ ఆఫీసుపైనా ఈ దాడులు జరిగాయి. ఇక విజయ్ పై దాడుల వెనుక బీజేపీ హస్తం ఉందని తమిళనాడులోని అన్ని రాజకీయ పార్టీల నేతలూ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, అన్నాడీఎంకే, డీఎంకే పార్టీల నాయకులు విజయ్ కి మద్దతుగా వ్యాఖ్యలు చేయడంతో ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. తన చిత్రాల్లో బీజేపీని విజయ్ విమర్శించడమే దాడులకు కారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు.