Polavaram Project: పోలవరంతో మాకు తీవ్ర నష్టం... ఆపేయాల్సిందే: సుప్రీంను ఆశ్రయించిన ఒడిశా ప్రభుత్వం

  • ఏపీలో భారీ ప్రాజెక్టుగా పేరుగాంచిన పోలవరం
  • పోలవరం నిలిపివేయాలంటూ సుప్రీంలో ఒడిశా ప్రభుత్వం అఫిడవిట్
  • ముంపు విషయంలో స్పష్టత లేదని ఆందోళన
  • 200 అడుగులకు పైగా ముంపు రావొచ్చని సందేహం

ఏపీలో భారీ నీటి పారుదల ప్రాజెక్టుగా పేరుగాంచిన పోలవరంకు ఒడిశా అడ్డుతగిలే ప్రయత్నం చేస్తోంది. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే తమ రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందంటూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. పోలవరం నిర్మాణం నిలిపివేతపై గతంలో రెండుసార్లు ఉత్తర్వులు (10-07-2018, 27-06-2019) రాగా, వాటిపై ఇచ్చిన స్టేను రద్దు చేయాలని ఒడిశా ప్రభుత్వం తన అఫిడవిట్ లో సుప్రీంకు విజ్ఞప్తి చేసింది. పోలవరం ముంపు విషయంలో స్పష్టతలేదని ఆరోపించింది. అంతేకాదు, ప్రాజెక్టు వద్ద గరిష్ట వరద నీటి ప్రవాహం ఏపీ సర్కారు చెబుతున్న దానికంటే ఎక్కువగా ఉంటుందని పేర్కొంది.

పోలవరం వద్ద గోదావరి వరద నీటి పరిమాణం 36 లక్షల క్యూసెక్కులు అని ఏపీ ప్రభుత్వం ట్రైబ్యునల్ కు వెల్లడించిందని, వాస్తవానికి ఆ వరద నీటి ప్రవాహం 50 లక్షల క్యూసెక్కులు ఉంటుందని ఒడిశా సర్కారు వివరించింది.  గోదావరిలో 58 లక్షల క్యూసెక్కుల మేర వరద వచ్చే అవకాశం ఉందని రూర్కీ ఐఐటీ కూడా చెప్పిందని పేర్కొంది. తద్వారా ఒడిశా పరిధిలోని ప్రాంతాల్లో 200 అడుగులకు పైగా ముంపు వచ్చే ప్రమాదం ఉందని ఒడిశా ఆందోళన వ్యక్తం చేసింది. ఇంతటి తీవ్ర వరదను పోలవరం డ్యామ్ ఎలా తట్టుకుంటుందన్నది సందేహాస్పదమేనని తెలిపింది.

  • Loading...

More Telugu News