Telangana: ముగిసిన తెలంగాణ ఒలింపిక్ సంఘం ఎన్నికలు
- ఓటింగ్ కు దూరంగా ముగ్గురు సభ్యులు
- తన ఓటును మరెవరో వేశారన్న మహీధర్
- సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్
తెలంగాణ ఒలింపిక్ సంఘం ఎన్నికల్లో భాగంగా నిర్వహించిన పోలింగ్ ముగిసింది. తెలంగాణ ఒలింపిక్ సంఘం అధ్యక్ష పదవికి ఈసారి ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్, ప్రొఫెసర్ రంగారావు బరిలో ఉన్నారు. బ్యాలెట్ పద్ధతిన జరిగిన పోలింగ్ లో 81 ఓట్లు పోలయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలోని 32 క్రీడా సంఘాలు, ఉమ్మడి జిల్లాల ఒలింపిక్ సంఘాలతో కలిపి మొత్తం 84 ఓట్లు ఉండగా, మాజీ ఎంపీ ఎంఏ ఖాన్, నర్సింగారెడ్డి, కైలాసం పోలింగ్ కు దూరంగా ఉన్నారు.
అటు, ఖమ్మం జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి మహీధర్ తన ఓటును మరొకరు వేశారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో గందరగోళం ఏర్పడింది. తన ఓటును వేరెవరో ఎలా వేస్తారంటూ ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కాగా, పోలింగ్ ముగియడంతో మరికాసేపట్లో కౌంటింగ్ ప్రక్రియ (సాయంత్రం 5 గంటలకు) ప్రారంభం కానుంది.