Chandrababu: చంద్రబాబుతో సన్నిహితంగా ఉన్న అధికారులపై ప్రభుత్వం కక్ష సాధిస్తోంది: వర్ల రామయ్య
- ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పై స్పందించిన వర్ల
- పాలన గాలికి వదిలేశారంటూ విమర్శలు
- కక్ష సాధింపు చర్యలకే ప్రాధాన్యమిస్తున్నారని ఆగ్రహం
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్ల రామయ్య ధ్వజమెత్తారు. పాలనను గాలికి వదిలేసి జగన్ కక్ష సాధింపు చర్యలకు ప్రాధాన్యమిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబుతో సన్నిహితంగా ఉన్న అధికారులపై ప్రభుత్వం కక్ష సాధిస్తోందని ఆరోపించారు. అర్ధరాత్రి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ జీవో ఇచ్చారంటూ మండిపడ్డారు. ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పై ఐఏఎస్ అధికారుల సంఘం స్పందించాలని సూచించారు.
వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ను ఎత్తివేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైఎస్ దగ్గర పనిచేసిన అధికారులు చంద్రబాబు వద్ద పనిచేయలేదా? అని ప్రశ్నించారు. ఏ తప్పు చేయని పోలీసులను ఏడు నెలలుగా ఎందుకు వీఆర్ లో ఉంచారని వర్ల రామయ్య నిలదీశారు. 3 నెలలు వీఆర్ లో ఉంటే జీతాలు ఇవ్వబోమంటున్నారని, జీతాలు ఇవ్వకపోతే ఉద్యోగులు ఎలా బతుకుతారని ఆవేదన వ్యక్తం చేశారు.