Akbaruddin Owaisi: మహంకాళి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని కేసీఆర్ కు అక్బరుద్దీన్ వినతి
- ప్రగతి భవన్ లో కేసీఆర్ ను కలిసిన అక్బరుద్దీన్
- అఫ్జల్ గంజ్ మసీదునూ అభివృద్ధి చేయాలని వినతి
- సానుకూలంగా స్పందించిన కేసీఆర్
హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను ఎంఐఎం చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ కలిశారు. పాతబస్తీలోని లాలా దర్వాజలో ఉన్న మహంకాళి దేవాలయాన్ని, ప్రాంగణాన్ని అభివృద్ధి చేయాలని విఙ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఓ వినతిపత్రం సమర్పించారు. ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయానికి సరిపడా స్థలం లేదని, ఆలయ ప్రాంగణాన్ని అభివృద్ధి చేయకపోవడం పర్వదినాల్లో భక్తులు ఇబ్బందిపడుతున్నారని సీఎం దృష్టికి తెచ్చారు. బోనాల పండగ సందర్భంగా లక్షలాది భక్తులు ఇక్కడికి వస్తారని, ఆలయ ప్రాంగణం కేవలం వంద గజాల స్థలంలోనే ఉండటం వల్ల భక్తులకు అసౌకర్యం కలుగుతోందని కేసీఆర్ కు తెలిపారు.
రూ.10 కోట్ల వ్యయంతో ఈ దేవాలయాన్ని విస్తరించి, అభివృద్ధి చేయాలని విఙ్ఞప్తి చేశారు. ఇదే సందర్భంలో మరో సూచన కూడా అక్బరుద్దీన్ చేశారు. ఆలయ విస్తరణ వల్ల ఇక్కడే ఉన్న వారి ఆస్తులు కోల్పోయే అవకాశం ఉంది కనుక జీహెచ్ఎంసీలో అధీనంలో ఉన్న ఫరీద్ మార్కెట్ ఆవరణలో 800 గజాల స్థలం ఇవ్వాలని విఙ్ఞప్తి చేశారు. అదేవిధంగా, పాతబస్తీలోని అఫ్జల్ గంజ్ మసీదు మరమ్మతుల కోసం రూ.3 కోట్లు కేటాయించాలని కోరారు. ఈ విఙ్ఞప్తులపై కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. ఇందుకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను ఆదేశించారు.