spaniel dog: స్పానియల్ జాతి కుక్కకు గుండె ఆపరేషన్!
- శునకానికి ఫేస్ మేకర్ అమర్చిన వైద్యులు
- వైద్య పరీక్షల్లో గుండె సంబంధిత సమస్య ఉందని గుర్తింపు
- ఆపరేషన్ చేసి సరిచేసిన డాక్టర్లు
మనుషులకు సాధారణంగా గుండె సమస్య ఉంటే ఆపరేషన్ చేసి సరిచేస్తారు. కానీ ఢిల్లీ వైద్యులు తొలిసారి ఓ శునకానికి గుండె ఆపరేషన్ చేసి దాని హృద్రోగ సమస్యను పరిష్కరించడం విశేషం. వివరాల్లోకి వెళితే...స్థానికంగా నివాసం ఉంటున్న ఓ పెద్దాయన ఖుషీ అనే కోకర్ స్పానియల్ జాతికి చెందిన కుక్కను పెంచుకుంటున్నారు. దీనికి గతంలో చెవికి సంబంధించిన శస్త్ర చికిత్స చేసినప్పుడు గుండె సంబంధిత సమస్య కూడా ఉందని వైద్యులు గుర్తించారు.
సాధారణంగా కుక్క గుండె నిమిషానికి 60 నుంచి 120 సార్లు కొట్టుకోవాల్సి ఉండగా ఖుషీ గుండె 20 సార్లు మాత్రమే కొట్టుకుంటోందని గుర్తించారు. తరచూ కుక్క మూర్చబోతోందని, బద్ధకంగా ఉంటోందని యజమాని చెప్పడంతో ఈ సమస్య వల్లే అలా జరుగుతోందని, ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని తెలిపారు.
దీనికి యజమాని సరే అనడంతో గత నెల 15వ తేదీన దాదాపు గంటన్నరపాటు వైద్యులు కష్టపడి శస్త్రచికిత్సను పూర్తి చేశారు. భారత దేశంలో ఇటువంటి ఆపరేషన్ ఇదే తొలిసారని వైద్యులు తెలిపారు. శునకం కోలుకున్న అనంతరం ఇందుకు సంబంధించిన వివరాలు నిన్న గురుగ్రాంకు చెందిన దాని యజమాని వెల్లడించారు. ప్రస్తుతం ఈ శునకరాజం చలాకీగా, చురుకుగా ఉంటోందని సంతోషం వ్యక్తం చేశారు.