sabarimala: శబరిమల వివాదం: విచారణకు విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు

  • ఆర్టికల్ 25 ఇచ్చిన మత స్వేచ్చ పరిధిని పరిశీలించాలి
  • మత ఆచారాల హక్కును సమీక్షించాలని సూచన
  • ఈ నెల 17వ తేదీ నుంచి రోజువారీ విచారణకు నిర్ణయం

శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతించడం, మత స్వేచ్ఛ, పలు మతాల ఆచార, వ్యవహారాల అంశం మరో మలుపు తిరిగింది. ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడం అత్యంత కీలకమని, అందువల్ల ఈ విషయాన్ని 9 మంది జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనానికి (కానిస్టిట్యూషనల్ బెంచ్ కు) అప్పగిస్తున్నామని సుప్రీంకోర్టు నేడు ప్రకటించింది.

వివిధ మతాలకు సంబంధించిన ఆచారాలు, నమ్మకాలకు సంబంధించిన ఏడు అంశాలను పరిశీలించాల్సి ఉందని, దీనిపై ఫిబ్రవరి 17వ తేదీ నుంచి రోజువారీ విచారణ నిర్వహించాలని ప్రతిపాదించింది. విచారణకు హాజరయ్యే పిటిషనర్ల లాయర్లు కానిస్టిట్యూషనల్ బెంచ్ కు సమాచారం ఇవ్వాలని సూచించింది.

అన్నింటినీ కలిపి..

శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతించాలంటూ గతంలో సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దానిపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగింది. మత విశ్వాసాల విషయాల్లో కోర్టులు కలుగజేసుకోవడం సరికాదంటూ కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. కోర్టు తీర్పును రివ్యూ చేయాలని కోరారు.

అదే సమయంలో వివిధ మత విశ్వాసాలు, ఆచారాలకు సంబంధించి ప్రశ్నలు లేవనెత్తుతూ పెద్ద సంఖ్యలో పిటిషన్లు దాఖలయ్యాయి. రాజ్యాంగంలో పేర్కొన్న మత స్వేచ్ఛ, ఇతర అంశాలపై స్పష్టత ఇవ్వాలని సుప్రీంకోర్టుకు వినతులు వచ్చాయి. వాటన్నింటిపై సోమవారం వరకు ఐదుగురు సభ్యులతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ జరిపింది. అన్నివర్గాల వాదనలు విన్న తర్వాత.. ఈ అంశం చాలా విస్తృతమైనదని, దీనిని తేల్చాల్సింది రాజ్యాంగ ధర్మాసనమేనని పేర్కొంది.

విచారణ చేపట్టాలని కోరిన అంశాలివే..

  • రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ఇచ్చిన మత స్వేచ్ఛ, దాని ప్రకారం వివిధ మతాల  ఆచారాలు, పరిస్థితులను పరిశీలించాలి.
  • ఆర్టికల్ 25 (2)(బి) కింద పేర్కొన్న ‘సెక్షన్ ఆఫ్ హిందూస్’ పాయింట్ ను వివరించాలి, మత ఆచారాలపై జుడిషియల్ రివ్యూ చేసే అధికారాన్ని సమీక్షించాలి.
  • ఏదైనా ఓ మతానికిగానీ, అందులోని నిర్ణీత సెక్షన్ కు గానీ చెందని వ్యక్తికి.. ఆ మతానికి, ఆ సెక్షన్ కు చెందిన నమ్మకాలను ప్రశ్నించే అధికారం ఉంటుందా?
  • మసీదులు, దర్గాల్లోకి ముస్లిం మహిళల ప్రవేశం, పార్సీయేతర పురుషులను పెళ్లి చేసుకున్న పార్సీ మహిళలను పవిత్ర స్థలాల్లోకి రానివ్వకపోవడం తదితర అంశాలనూ పరిశీలించాలి.

  • Loading...

More Telugu News