Madhavi Latha: స్పై కెమెరాలతో చూసినట్టు ఏదేదో నా గురించి రాసేస్తారు!: నటి మాధవీ లత

 Actress Madhavi Latha complains against trollers
  • ఇలాంటి కామెంట్స్ చేస్తుంటే ఎన్ని రోజులు భరించాలి?
  • నా హక్కులు నేను కాపాడుకోవాలి
  • మన పోరాటం మనమే చేసుకోవాలి
ప్రతిరోజూ తమ ఇంటిపై స్పై కెమెరాలు పెట్టి చూసినట్టు తన గురించి ఏదేదో సామాజిక మాధ్యమాల్లో తనను ట్రోల్ చేసేవాళ్లు రాసేస్తుంటారని బీజేపీ మహిళా నాయకురాలు, ప్రముఖ నటి మాధవీ లత విమర్శించారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ఇలాంటి అసభ్య పోస్ట్ లు చేసే వారికి ఘాటుగా బదులిస్తానని, ‘స్టే ఎట్ మై హోం’ అనో లేకపోతే తమ అపార్టుమెంట్ బయట స్పై కెమెరా పెట్టుకుని కూర్చోమనో కామెంట్స్ పెడుతుంటానని చెప్పారు.

‘ఇలాంటి కామెంట్స్ చేస్తుంటే ఎన్ని రోజులు భరించాలి? నా హక్కులు నేను కాపాడుకోలేక పోతే ఇంకెవరు కాపాడతారా? మన పోరాటం మనమే చేసుకోవాలి’ అని అన్నారు. నిజాయతీగా చెప్పాలంటే ఈ కంప్లయింట్ తప్ప ఇంత వరకూ తాను ఫిర్యాదు చేయలేదని అన్నారు. ఇలాంటి పోస్ట్ లు వచ్చినప్పుడు తనను తానే నియంత్రించుకునే దానిని అని, కొంత మంది అకౌంట్లను తొలగించడం వంటివి చేయించే దానిని అనీ అన్నారు.  

కాగా, తనను అసభ్య పదజాలంతో దూషిస్తూ వస్తున్న పోస్ట్ ల విషయమై సైబరాబాద్ సీపీ సజ్జనార్ కు ఈరోజు ఆమె ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాతపూర్వకంగా ఫిర్యాదు చేశానని చెప్పారు. ఈ తరహా ఫిర్యాదులు చాలా వస్తున్నాయని, చర్యలు చేపడతామని సజ్జనార్ చెప్పారని అన్నారు.
Madhavi Latha
Artist
BJP
Social Media
Troll

More Telugu News