Arvind Kejriwal: ఉత్కంఠ వీడింది... 15 సీట్లు తగ్గినా, అధికారం కేజ్రీవాల్ దే!
- 52 చోట్ల ఆధిక్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ
- 17 స్థానాలకు పరిమితమైన బీజేపీ
- ఈ వారం చివరిలోగా కేజ్రీ ప్రమాణం
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఉత్కంఠ వీడినట్టే. గత ఎన్నికల్లో 67 స్థానాలను గెలుచుకున్న కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ కు, ఈ దఫా ఓ 15 వరకూ సీట్లు తగ్గుతాయని ట్రెండ్స్ ను పరిశీలిస్తే తెలుస్తోంది. మొత్తం 70 స్థానాల్లో ట్రెండ్స్ వెలువడగా, 52 చోట్ల ఆప్, 17 చోట్ల బీజేపీ, ఒక స్థానంలో ఇతరులు ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్ ఒక్క చోట కూడా ప్రభావం చూపలేకపోయింది.
ఢిల్లీ వ్యాప్తంగా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటుండగా, ఈ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పవుతాయని నిన్నటి వరకూ బీరాలు పోయిన బీజేపీ నేతలెవరూ ఇంకా మీడియా ముందుకు రాలేదు. ఈ వారం చివరిలోగా, మూడవసారి ఢిల్లీ పీఠంపై కేజ్రీవాల్ సీఎంగా కూర్చుంటారని ఆప్ వర్గాలు అంటున్నాయి.