Virat Kohli: మ్యాచ్ లు గెలిచేంత స్థాయిలో మా బౌలింగ్, ఫీల్డింగ్ లేవు: కోహ్లీ
- కివీస్ చేతిలో టీమిండియా క్లీన్ స్వీప్
- చివరి వన్డే ఓటమి అనంతరం కోహ్లీ నిరాశ
- రాబోయే టెస్టు సిరీస్ పై దృష్టి పెడతామని వ్యాఖ్యలు
న్యూజిలాండ్ చేతిలో వన్డే సిరీస్ పరాభవం ఎదురైన నేపథ్యంలో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ స్పందించాడు. కివీస్ తో మూడో వన్డే ఓటమి అనంతరం మాట్లాడుతూ, ఈ మూడు వన్డేల సిరీస్ లో తమ బౌలింగ్, ఫీల్డింగ్ అంతర్జాతీయ స్థాయిలో లేవని, మ్యాచ్ లు గెలిపించడానికి తమ జట్టు చేసిన ప్రయత్నాలు సరిపోవని అభిప్రాయపడ్డాడు. కొన్ని సందర్భాల్లో తమ బ్యాట్స్ మెన్ పట్టుదల ప్రదర్శించినా, విజేతగా అవతరించడానికి ఆ ప్రదర్శనలు తక్కువేనని పేర్కొన్నాడు.
టి20 సిరీస్ ను ఓడిపోయిన తర్వాత న్యూజిలాండ్ ఆటగాళ్లు తీవ్రమైన గెలుపు కాంక్షతో బరిలో దిగారని, ఈ విషయంలోనే తాము వెనుకబడిపోయామని కోహ్లీ అంగీకరించాడు. ఇక తమ దృష్టంతా రాబోయే టెస్టు సిరీస్ పైనే ఉందని, టెస్టుల్లో తమది సమతూకంతో ఉన్న జట్టు అని అభివర్ణించాడు. అయితే, మైదానంలో దిగినప్పుడు సరైన దృక్పథం ప్రదర్శించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశాడు. కాగా, టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ ఈ నెల 21న ఆరంభం కానుంది. అంతకుముందు భారత్ ఓ ప్రాక్టీసు మ్యాచ్ ఆడనుంది.