Nirbhaya: నిర్భయ దోషులకు నోటీసులు జారీ చేసిన సుప్రీం కోర్టు
- ఢిల్లీ హైకోర్టు నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం
- విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు
- ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్
నిర్భయ దోషుల ఉరి అమలుపై ఇచ్చిన స్టేని ఎత్తివేయాలంటూ తాము దాఖలు చేసిన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేయడంతో కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కేంద్రం వేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన ముగ్గురు సభ్యుల సుప్రీం ధర్మాసనం నిర్భయ దోషులకు నోటీసులు జారీ చేసింది.
అంతేకాదు, నిర్భయ దోషులు నలుగురినీ ఉరితీసే కొత్త తేదీ ప్రకటించాలని అధికారులు ట్రయల్ కోర్టును కోరే అవకాశం కల్పించింది. ట్రయల్ కోర్టు నిర్భయ దోషుల ఉరిపై కొత్త తేదీని ప్రకటించేందుకు కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్ ఏ విధంగానూ అడ్డంకి కాబోదని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 13కి వాయిదా వేసింది.
అటు కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ, ఈ ఘటన సమాజంపై ఎలాంటి ప్రభావం చూపిందన్న అంశాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దోషుల అప్పీళ్లను అత్యున్నత న్యాయస్థానం 2017లోనే కొట్టివేసినా, ప్రభుత్వం వారిని ఉరితీసేందుకు ఇప్పటికీ ఆటంకాలు ఎదుర్కొంటోందని వివరించారు.