Vijay Mallya: లండన్ కోర్టులో విచారణకు హాజరైన విజయ్ మాల్యా
- మాల్యాపై తీవ్ర ఆర్థిక ఆరోపణలు
- లండన్ పారిపోయిన మాల్యా
- మాల్యాను భారత్ రప్పించేందుకు కేంద్రం ప్రయత్నాలు
ఆర్థిక అవకతవకలు, మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్ మాల్యాను స్వదేశానికి రప్పించేందుకు కేంద్రం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై లండన్ కోర్టులో విచారణ జరగ్గా, విజయ్ మాల్యా హాజరయ్యారు. మాల్యా తరఫు న్యాయవాది క్లేర్ మాంట్ గోమెరీ స్పందిస్తూ, తన క్లయింటును భారత్ కు పంపాలంటూ గతంలో తీర్పు వచ్చిందని, కానీ ఆ సమయంలో ఆధారాలను పట్టించుకోలేదని, 2012లో కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ దివాలా తీయడానికి గల కారణాలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆరోపించారు. ఇదేమీ మనీ సర్క్యులేషన్ తరహా నేరం కాదని, ఇదో విమానయాన సంస్థకు సంబంధించిన అంశమని తెలిపారు. డాక్టర్ మాల్యా ఓవర్ నైట్ కుబేరుడు కాలేదని, అపారమైన సంపద ఆయన సొంతం అని వాదించారు.
దీనికి భారత ప్రభుత్వం స్పందిస్తూ, అవినీతికి సంబంధించిన ఆరోపణలపై మాల్యా విచారణ ఎదుర్కోవాల్సిందేనని కోర్టులో వాదనలు వినిపించింది. దీనిపై కోర్టు నిర్ణయం వెలువడాల్సి ఉంది. భారత్ లో లిక్కర్ కింగ్ గా పేరుగాంచిన విజయ్ మాల్యాను 2017 ఏప్రిల్ లో లండన్ లో అరెస్ట్ చేశారు. వేల కోట్ల రూపాయలు ఎగవేతకు పాల్పడ్డాడంటూ 17 బ్యాంకులు మాల్యాపై ఫిర్యాదు చేశాయి. దాంతో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేయగా, బెయిల్ పై బయటికి వచ్చారు.