Hyderabad: హైదరాబాద్ హోటల్‌లో కలకలం.. ఆహారం తిని బాలుడి మృతి!
- బేగంపేట్‌లోని ‘మానస సరోవర్’ హోటల్‌లో ఘటన
- అమెరికా వెళ్లేందుకు వీసా కోసం హైదరాబాద్‌కు వచ్చిన 'సాఫ్ట్‌వేర్' దంపతులు
- స్టార్ హోటల్‌లో బస
- ఈ రోజు ఉదయం బాలుడి మృతి
హైదరాబాద్‌లోని బేగంపేట్‌లో ఉన్న ‘మానస సరోవర్’ హోటల్‌లో విషాహారం వలన ఓ బాలుడు చనిపోయినట్లు కలకలం చెలరేగింది. బాధితుల కధనం ప్రకారం అమెరికా వెళ్లేందుకు వీసా కోసం హైదరాబాద్‌కు వచ్చిన 'సాఫ్ట్‌వేర్' దంపతులు ఏట్కూరి రవి నారాయణరావు, శ్రీవిద్య తమ ఇద్దరు కుమారులతో కలిసి ఆ హోటల్‌లో బస చేశారు. అక్కడే విషాహారం తినడంతో వారి రెండేళ్ల కుమారుడు విహాన్ ప్రాణాలు కోల్పోయాడు. నిన్న రాత్రి వారంతా ఇండియన్ బ్రెడ్ బాస్కెట్, కడాయ్ పన్నీర్‌ను ఆహారంగా తీసుకున్నాక అర్ధరాత్రి సమయంలో చిన్న కుమారుడు విహాన్ వాంతులు చేసుకున్నాడు. కొద్దిసేపటికే రవి నారాయణకు కడుపు నొప్పి వచ్చింది. పెద్ద కుమారుడు, భార్య కూడా వాంతులు చేసుకున్నారు. ఈ రోజు తెల్లవారు జామున విహాన్ మృతి చెందాడు.
మానస సరోవర్ హోటల్‌లో విషాహారం తిని తన కుమారుడు చనిపోయినట్లు తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, తమ కూతురి కుటుంబంపై మానస సరోవర్ హోటల్ యాజమాన్యం తప్పుడు ఆరోపణలు చేస్తోందని, హోటల్‌లో ఆమె కుటుంబం ఆత్మహత్య యత్నం చేసిందని అంటున్నారని శ్రీవిద్య కుటుంబ సభ్యులు తెలిపారు. ఫుడ్ పాయిజన్ కావడంతోనే తమ మనవడు చనిపోయాడని మీడియాకు చెప్పారు. హోటల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లుగా బెంగళూరులో ఆరేళ్లుగా పనిచేస్తున్న రవి నారాయణరావు, శ్రీవిద్యలది ఖమ్మం జిల్లా పెనుబోలు మండలం లింగగూడం సొంతూరు.