KIA Motors: కియా పరిశ్రమ గురించి వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిందే: చంద్రబాబు
- కియా సంస్థ సందర్శనకు వెళ్లిన సీపీఐ నేత రామకృష్ణ అరెస్టు అన్యాయం
- నిజాలను తెలుసుకుందామని వెళుతున్న నేతలను అరెస్టు చేస్తారా?
- కియా సంస్థను ఎవరు బెదిరించారు? వార్తల్లో నిజానిజాలేంటి? నిగ్గు తేల్చాలి
రాష్ట్రంలోని కియా మోటార్స్ సంస్థ తమిళనాడుకు తరలిపోతుందని ఓ జాతీయ పత్రికలో వార్త రావడం, అ వెంటనే వైసీపీ ప్రతినిధులు కియా ప్రతినిధులతో కలిసి ఆ వార్తను తప్పని చెప్పించడం వంటి ఘటనలపై నిజా నిజాలు ప్రజలకు తెలియాలని చంద్రబాబు ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు. ఈ రోజు కియా సంస్థను చూడడానికి వెళుతున్న సీపీఐ నేత రామకృష్ణ కారును పోలీసులు వెంబడించడం.. అనంతరం ఆయనను అరెస్టు చేయడాన్ని చంద్రబాబు ఆక్షేపించారు.
‘కియా పరిశ్రమకు వెళ్తున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారి కారును పోలీసులు వెంబడించి మరీ ఆయనను అరెస్టు చేయడం ఏమిటి? ఆయనేమైనా నేరస్థులా? అనంతపురం జిల్లాలో సీపీఐ నేతల గృహ నిర్భంధాన్ని, అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాను. కియా పరిశ్రమ గురించి వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిందే.
కియా తమిళనాడుకు తరలిపోతుందని వార్త రావడం, ఆ వెంటనే కియా ప్రతినిధులతో వైసీపీ నేతలు ఇది నిజం కాదని చెప్పించడం. మరుసటి రోజే మేము రాసింది నిజమే అంటూ ఆ జాతీయ పత్రిక చెప్పడం.. ఏమిటివన్నీ? తెరవెనుక జరిగింది ఏమిటి? కియా సంస్థను ఎవరు బెదిరించారు? ఎవరు వేధించారు? వార్తల్లో నిజానిజాలేమిటి? ప్రజలకు తెలియొద్దా? వాస్తవాలను నిర్ధారించుకోవడానికి వెళుతున్న నేతలను అరెస్టు చేశారంటే..ఇందులో ప్రభుత్వం దాస్తున్న అంశాలేమిటి? ప్రభుత్వం వెంటనే సీపీఐ నేతలను విడుదల చేయాలి’ అని చంద్రబాబు డిమాండ్ చేశారు.