Giriraj singh: సీఏఏ నిరసనకారులపై కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
- దేవ్‌బంద్ పట్టణం ఉగ్రవాద ముఠాల అడ్డా
- హఫీజ్ సయీద్ సహా అందరూ అక్కడే పుట్టారు
- షహీన్‌బాగ్ నిరసనలపైనా మంత్రి తీవ్ర వ్యాఖ్యలు
ఉత్తరప్రదేశ్‌లోని షహరాన్‌పూర్ జిల్లా దేవ్‌బంద్ పట్టణాన్ని ఉగ్రవాదుల అడ్డాగా అభివర్ణించిన కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. షహరాన్‌పూర్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్న వారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వారికి అవగాహన కల్పించలేమని, ఎందుకంటే వారంతా దేవ్‌బంద్ పట్టణం వారేనని అన్నారు. హఫీజ్ సయీద్ సహా ప్రపంచంలోని ఉగ్రవాదులందరూ ఇక్కడ జన్మించినవారేనంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అక్కడితో ఆగని మంత్రి దేవ్‌బంద్ పట్టణం ఉగ్రవాద ముఠాల అడ్డా అని తానెప్పుడో చెప్పానన్నారు. అలాగే, షహీన్‌బాగ్ నిరసనలపైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అది ఆత్మాహుతి దళాలను తయారుచేస్తున్న కేంద్రంగా మారిందన్నారు. కేంద్రమంత్రి వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ప్రతిపక్షాలు ఆయనపై దుమ్మెత్తి పోస్తున్నాయి.