Yanamala: విశాఖలో భూ కబ్జాలు మొదలెట్టారు: టీడీపీ నేత యనమల
- మూడు రాజధానులు కట్టమని ఎవరూ అడగలేదు
- జగన్ సొంతంగా నిర్ణయం తీసుకున్నారు
- భూ కబ్జాలపై విచారణ జరపాలి
- అధికార పార్టీ వారు ఎవరు భూములు కొంటున్నారు?
వైసీపీ నేతలపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఆరోపణలు గుప్పించారు. ఈ రోజు మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... 'మూడు రాజధానులు కట్టమని ఎవరూ అడగలేదు. అయినప్పటికీ మూడు రాజధానులు అంటూ సొంతంగా నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నంలో భూ కబ్జాలు మొదలు పెట్టారు.. దీనిపై విచారణ జరపాలి' అంటూ డిమాండ్ చేశారు.
'అధికార పార్టీ వారు ఎవరు భూములు కొంటున్నారు? ఎవరెవరు కబ్జాలు చేస్తున్నారు? నాయకుల స్వార్థంతో రాజధానిని, హైకోర్టును మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఇటువంటి సమయంలో రాజకీయ సంక్షోభాన్ని సృష్టించి, రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు' అని యనమల మండిపడ్డారు.
'ఆర్టీఐ కింద దరఖాస్తు చేస్తే సమాధానాలు చెప్పడానికి వెనుకాడుతున్నారు. ఎందుకిలా చేస్తున్నారు? నిన్న జగన్‌ను మోదీ పలు అంశాలపై నిలదీసినట్లు తెలిసింది. అసెంబ్లీ నుంచి మండలికి చాలా బిల్లులు వచ్చాయి. అసెంబ్లీ నుంచి వచ్చిన బిల్లులను మేము అడ్డుకోలేదు. వాటిల్లో రెండింటిని మాత్రమే వెనక్కి పంపాము. సెలెక్ట్ కమిటీకి పంపితే ఎందుకు భయపడుతున్నారో అర్థం కావట్లేదు' అని యనమల విమర్శించారు.