Ratan Tata: నేను కూడా ప్రేమలో పడ్డా.. వ్యవహారం పెళ్లి వరకు వెళ్లింది: పలు సంచలన విషయాలను పంచుకున్న రతన్ టాటా

Ratan Tata reveals his love story

  • చిన్నప్పుడు అమ్మానాన్నలు విడాకులు తీసుకోవడంతో చాలా ఇబ్బంది పడ్డాం
  • నేను ఆర్కిటెక్చర్ చదవడంతో నాన్న రగిలిపోయారు
  • ఇండో-చైనా యుద్ధం మా ప్రేమకు ముగింపు పలికింది

రతన్ టాటా అనగానే మనకు ఒక సక్సెస్ ఫుల్ బిజినెస్ మెన్ గుర్తుకొస్తారు. టాటా సంస్థలను అత్యున్నత స్థానానికి చేర్చిన ఒక మేధావి కళ్లముందు కదులుతారు. 82 ఏళ్ల వయసులో కూడా ఎంతో చలాకీగా ఉంటూ, చిరునవ్వులు చిందించే ఒక గొప్ప వ్యక్తి కనపడతారు. అంతేకాదు, ఆయన ఒక బ్రహ్మచారి అనే విషయం కూడా స్మరిస్తుంది.

అయితే, తన జీవితంలో కూడా ఒక ప్రేమ కథ ఉందంటూ ఒక సంచలన విషయాన్ని రతన్ టాటా బయటపెట్టారు. తాను కూడా ఓ అమ్మాయిని ప్రేమించానని, విషయం పెళ్లి వరకు వెళ్లిందని చెప్పారు. కొన్ని కారణాల నేపథ్యంలో, ఆ కథ కంచికి చేరిందని వెల్లడించారు. ప్రముఖ ఫేస్ బుక్ పేజ్ 'హ్యూమన్స్ ఆఫ్ బాంబే'లో రతన్ టాటా తన జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకున్నారు. ఆయన ఏం చెప్పారో ఆయన మాటల్లోనే చూద్దాం.

'నా చిన్నతనం చాలా సంతోషంగా గడిచిపోయింది. అయితే నేను, నా సోదరుడు కొంచెం పెద్దవాళ్లమయిన (అప్పుడు రతన్ టాటాకు 10 ఏళ్లు) తర్వాత మా తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడంతో కొంత ఇబ్బంది పడ్డాం. కొందరి సూటిపోటి మాటలను కూడా వినాల్సి వచ్చింది. ఇప్పటి మాదిరి అప్పట్లో విడాకులు తీసుకోవడమంటే సాధారణ విషయం కాదు. ఆ తర్వాత మేము నానమ్మ వద్ద పెరిగాం. మా అమ్మ రెండో వివాహం చేసుకున్న తర్వాత స్కూల్లోని పిల్లలు మమ్మల్ని నానా రకాలుగా మాటలతో వేధించేవారు. అయితే, ఎట్టి పరిస్థితుల్లో గౌరవాన్ని కోల్పోయే విధంగా ప్రవర్తించవద్దని నానమ్మ మాకు చెప్పేది. ఇప్పటికీ నేను నానమ్మ చెప్పినదాన్ని పాటిస్తూనే ఉన్నా.
రెండో ప్రపంచ యుద్ధం నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ సమయంలో నన్ను, నా సోదరుడిని వేసవి సెలవుల కోసం నానమ్మ లండన్ కు తీసుకెళ్లింది. అప్పుడే నైతిక విలువల గురించి ఆమె మాకు బోధించింది. తల్లిదండ్రుల గురించి ఎక్కడా ప్రస్తావించవద్దని తెలిపింది. అన్నిటికన్నా గౌరవమే ముఖ్యమని హితబోధ చేసింది. నానమ్మ చెప్పిన విషయాలు మా మనసుల్లో నాటుకుపోయాయి.

మాకు సంబంధించిన ప్రతి విషయంలో నానమ్మ ఉండేది. ఎవరు కరెక్టో? ఎవరు తప్పో? చెప్పడం చాలా కష్టం. నేను వయోలిన్ నేర్చుకోవాలనుకున్నా. నాన్న పియానో నేర్చుకోమన్నారు. నేను అమెరికాలో కాలేజ్ కు వెళ్లాలనుకున్నా. నాన్న యూకేకు వెళ్లమన్నారు. నేను ఆర్కిటెక్ట్ కావాలనుకున్నా. నాన్న ఇంజినీరింగ్ చదవమన్నారు.

నానమ్మ కూడా నాన్నలా చేసి ఉంటే... నేను అమెరికాలోని కార్నెల్ యూనివర్శిటీలో చదివేవాడ్నే కాదు. నానమ్మ వల్లే నేను మెకానికల్ ఇంజినీరింగ్ లో చేరినప్పటికీ, ఆ తర్వాత అర్కిటెక్చర్ కు మారి డిగ్రీ తీసుకున్నా. అయితే ఇది నాన్నకు ఎంత మాత్రం నచ్చలేదు. నాపై రగిలిపోయారు. ఏదేమైనప్పటికీ నేను కావాలనుకున్నవాటిని సాధించా. ధైర్యంగా మాట్లాడటంతో పాటు... సమయాన్ని బట్టి మృదువుగా ఉండటం, గౌరవప్రదంగా బతకడం ఇవన్నీ నానమ్మ వల్లే అలవడ్డాయి.

కాలేజీలో చదువు పూర్తైన తర్వాత లాస్ ఏంజెలెస్ లో ఒక ఆర్కిటెక్చర్ కంపెనీలో ఉద్యోగిగా చేరా. అక్కడ రెండేళ్ల పాటు నేను పని చేశా. అప్పటి రోజులు సంతోషంగా గడిచిపోయాయి. వాతావరణం కూడా ఎంతో ఆహ్లాదంగా ఉండేది. నాకు సొంత కారు కూడా ఉండేది. నా ఉద్యోగాన్ని నేను ఎంతో ప్రేమించేవాడిని.

లాస్ ఏంజెలెస్ లోనే నేను ప్రేమలో పడ్డా. వ్యవహారం పెళ్లి వరకు వెళ్లింది. అయితే పెళ్లి విషయంలో కొంత కాలం వేచి చూద్దామని నేను అనుకున్నా. ఎందుకంటే అప్పటికే ఏడేళ్ల నుంచి నానమ్మ ఆరోగ్యం బాగోలేదు. నేను ఆమెకు దగ్గరగా లేను. దీంతో, నానమ్మను చూసేందుకు నేను ఇండియాకు వచ్చా. నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని, ఇండియాకు తీసుకురావాలనే నిర్ణయాన్ని కూడా తీసుకున్నా. అయితే 1962 ఇండో-చైనా యుద్ధం నేపథ్యంలో మా పెళ్లికి ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో, మా ప్రేమ బంధం అలా ముగిసిపోయింది' అంటూ రతన్ టాటా తన జీవితంలోని పలు స్మృతులను నెమరువేసుకున్నారు.

  • Loading...

More Telugu News