Bomb Explodes: లక్నో కోర్టులో బాంబు పేలుడు
- ముగ్గురు న్యాయవాదులకు గాయాలు
- పోలీసుల తనిఖీల్లో బయల్పడ్డ మరో మూడు నాటు బాంబులు
- ఒక న్యాయవాదిని లక్ష్యం చేసుకుని బాంబు దాడి?
ఎప్పుడూ పోలీసులు, న్యాయవాదులతో సందడిగా ఉండే న్యాయస్థానాలకు కూడా భద్రత కరవవుతోంది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో కోర్టు ప్రాంగణంలో బాంబు పేలుడు సంభవించగా ముగ్గురు న్యాయవాదులు గాయపడ్డారు. సమాచారమందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ముందు జాగ్రత్తగా అక్కడ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో మరో మూడు నాటు బాంబులు వారికి దొరికాయి.
ఇద్దరు న్యాయవాదుల మధ్య వైరమే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. న్యాయవాది సంజీవ్ లోధీని లక్ష్యంగా చేసుకుని ఈ పేలుళ్లకు పాల్పడినట్లు సమాచారం. బాంబు పేలుళ్లకు కొద్ది సేపటిముందే లోధీపై దాడి కూడా జరిగినట్లు తెలుస్తోంది. స్థానిక మీడియాలో వివరాల ప్రకారం.. పేలుడు జరిగిన అనంతరం గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు కూడా జరిపారని తెలుస్తోంది. ఈ బాంబు పేలుడు ఘటనపై న్యాయవాది సంజీవ్ లోధీ స్పందిస్తూ.. జితు యాదవ్ అనే న్యాయవాది తనను లక్ష్యం చేసుకుని ఈ దాడి చేశాడని ఆరోపించారు.