అటువంటి వారు గాడిదలు... ‘షికారా’ చూసి వ్యాఖ్యానించండి: నిర్మాత విధు చోప్రా
- కశ్మీర్ పండితుల వలసలపై తీసిన ‘షికారా’ చిత్రం
- వలస కష్టాలను వాణిజ్యపరంగా చేశారని ఆరోపణలు
- తీవ్రవాదాన్ని చూపించలేదన్న ఓ కశ్మీరీ మహిళ వీడియో వైరల్
ట్విట్టర్ లో బాయ్ కాట్ షికారా అనే హ్యాష్ ట్యాగ్ తో సినిమాను వ్యతిరేకిస్తూ సందేశాలు పెడుతున్నారు. ‘నువ్వు తీవ్రవాదాన్ని చూపించలేదు. ఇస్లాం తీవ్రవాదానికి మా కుటుంబాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఒక కశ్మీరీ పండిత్ గా నేను నీ సినిమాను గుర్తించడంలేదు’ అని ఓ కశ్మీరీ మహిళ చోప్రాపై ఆగ్రహం చేస్తూ.. తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఈ విమర్శలపై చోప్రా ప్రతి విమర్శలు చేస్తూ.. అనాలోచితంగా విమర్శలు చేస్తున్న వారు గాడిదలన్నారు. ‘నేను నిర్మించిన త్రీ ఇడియట్స్ తొలి రోజు రూ.33 కోట్లు వసూలు చేయగా, షికారా తొలి రోజు రూ.30 లక్షలు రాబట్టింది. ఈ సినిమా తీయడానికి మాకు 11 ఏళ్లు పట్టింది. రూ.33 కోట్లు రాబట్టిన సినిమా చేశాను. నా తల్లి ఙ్ఞాపకార్థం తీసిన ఈ సినిమా తొలిరోజు రూ.30 లక్షలు రాబట్టింది. అయినా కశ్మీర్ పండితుల బాధను నేను వాణిజ్యపరంగా చేశానని మాట్లాడుతున్నారు. అటువంటివారు గాడిదలని నేను అనుకుంటున్నాను..గాడిదలు కాకండి, ముందుగా సినిమా చూసి ఆ తర్వాత ఓ అభిప్రాయానికి రండి’ అని వ్యాఖ్యానించారు.