North korea: కరోనా అనుమానితుడిని కాల్చి చంపిన ఉత్తర కొరియా
- చైనా వెళ్లి వచ్చిన అధికారిని కాల్చి వేసిందని దక్షిణ కొరియా వెల్లడి
- కరోనా వైరస్ దేశంలోకి ప్రవేశించకుండా సైనిక చట్టాలు అమలు
- చైనాతో సరిహద్దులు మూసివేత
ప్రమాదకర వైరస్ లు వ్యాప్తి చెందుతున్న సమయంలో ఆ వైరస్ తమ దేశంలోకి ప్రవేశించకుండా ఉత్తర కొరియా కఠినంగా ఆంక్షలను అమలు చేయడం ప్రపంచ దేశాలకు తెలుసు. గతంలో చైనాలో మొదలైన సార్స్ వైరస్ ను నిరోధించడానికి ఉత్తర కొరియా కఠిన నిబంధనలు అమలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా కరోనా వైరస్ విజృంభించడంతో ఉత్తర కొరియా మళ్లీ అలాంటి నిబంధనలనే అమలు చేస్తోంది.
చైనా నుంచి వచ్చిన వారిని, చైనా ప్రజలను నిర్బంధించాలని ఆ దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆదేశాలు జారీచేశారు. చైనాతో సరిహద్దులను మూసివేశారు. రోడ్డు మార్గాలు మూసివేయడమో లేక కఠిన నిషేధాలు అమలు చేయడమో అమలు చేస్తోంది. పర్యాటకులను నిషేధించింది. కరోనా వైరస్ చాయలు తమదేశంలోకి రాకుడదన్న సంకల్పంతో దేశలో సైనిక చట్టాలను అమలు చేస్తోంది.
ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే.. చర్యలు ఎలా ఉంటాయన్నది తాజా ఘటనతో ప్రపంచానికి చాటింది. కరోనా వైరస్ సోకిందన్న కారణంగా ఓ అధికారిని కాల్చివేసిందని.. పొరుగుదేశమైన దక్షిణ కోరియా మీడియా ఈ రోజు ఓ వార్తను ప్రచురించింది. అ అధికారి విధి నిర్వహణలో భాగంగా ఇటీవల చైనాకు వెళ్లి రావడంతో ఉత్తర కొరియా అధికారులు ఆ అధికారిని తొలుత నిర్బంధించారు. అయితే ఆ అధికారి ఓ పబ్లిక్ బాత్ రూంలో స్నానం చేయడానికి వెళుతున్న సమయంలో అధికారులు గుర్తించి కాల్చి వేశారని దక్షిణ కొరియా మీడియా కథనం.
కాగా ఉత్తర కొరియాలో కరోనా కేసు నమోదైనట్లుగా అధికారికంగా ఇప్పటివరకూ ప్రకటించలేదు. ఉత్తరకొరియాకు చెందిన వర్కర్లు చైనాలో వేలమంది పనిచేస్తున్నారని..వారిని వెంటనే స్వదేశానికి పంపాలని ఐక్యరాజ్య సమితి చైనా ప్రభుత్వానికి ఇచ్చిన గడువు డిసెంబర్ తో ముగిసిపోయింది. వారిలో ఎంతమంది ఉత్తరకొరియాకు వచ్చారో ఇప్పటికీ ఎవరికీ తెలియదు.