Jairam Ramesh: కాంగ్రెస్ కు కరోనా వైరస్ పట్టుకుంది: జైరామ్ రమేశ్ కీలక వ్యాఖ్యలు
- మైనారిటీ మతవాదంపై తప్పుడు సంకేతాలు
- బీజేపీ ఓట్లను మాత్రమే చీల్చింది
- కాంగ్రెస్ నష్టపోయిందన్న జైరామ్ రమేశ్
ఢిల్లీకి జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి కరోనా వైరస్ లా తాకాయని ఆ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేశ్ అభిప్రాయపడ్డారు. మైనారిటీ మతవాదంపై కాంగ్రెస్ సామరస్య ధోరణితో ఉంటోందన్న ప్రచారంతో నష్టం జరిగిందని అన్నారు. షహీన్ బాగ్, పౌరసత్వ చట్టం తదితర అంశాలను బీజేపీ ప్రచార అస్త్రంగా చేసుకుందని, తద్వారా ఓట్లను చీల్చిందే తప్ప, ఆ పార్టీ గెలవలేకపోయిందని, అధిక నష్టం జరిగింది మాత్రం కాంగ్రెస్ పార్టీకేనని అన్నారు.
ఒక్కసారిగా కరోనా సోకితే ఎంత నష్టం జరుగుతుందో, అంత నష్టం కాంగ్రెస్ కు జరిగిందని తెలిపారు. మైనారిటీ ప్రజల మనోభావాల పట్ల కొందరు సీనియర్లు సున్నితంగా వ్యవహరించాలని చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన ఆయన, దీంతో తాము మతవాదంపై చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నామన్న దుష్ప్రచారం జరిగిందని, దానివల్లే ఎంతో నష్టం జరిగిందని అన్నారు.