health: మీ పిల్లలు కుర్చీకి అతుక్కుపోయి కూర్చుంటున్నారా?.. అయితే జాగ్రత్త అంటోన్న పరిశోధకులు
- కుర్చీలకు అతుక్కుపోయి కూర్చుంటే డిప్రెషన్
- కనీసం గంట సమయమైనా శరీర కదలికలుండాలి
- యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ పరిశోధకులు వెల్లడి
కొందరు పెద్దలే కాదు.. పిల్లలు కూడా కుర్చీలకు అతుక్కుపోయి కనపడుతుంటారు. ఇంట్లో చదువుకునే సమయంలో, కంప్యూటర్, టీవీల ముందు, బడిలోనూ కుర్చీలకే పరిమితమవుతూ శరీర కదలికల గురించి పట్టించుకోని విద్యార్థులు తమ తీరును మార్చుకోవాలని చెబుతున్నారు. ఇటువంటి అలవాటు ఉన్నవారు దానిని మానుకోకపోతే ఆరోగ్య సమస్యలు తప్పవని యూకేలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
12 నుంచి 16 ఏళ్లలోపు బాలలకు ఈ అలవాటు ఉంటే వారికి 18 ఏళ్లు వచ్చేసరికి దుష్ఫలితాలు కనిపిస్తాయని, డిప్రెషన్ (మానసిక కుంగుబాటు)ను ఎదుర్కొంటారని పరిశోధకులు తేల్చారు. ప్రతిరోజు కుర్చీకే అతుక్కుని కూర్చోకుండా వ్యాయామం చేయాలని సూచించారు. కనీసం గంట సమయమైనా శరీర కదలికల కోసం సమయం కేటాయించాలని చెబుతున్నారు.
ఇలా చేస్తే బాలలు భవిష్యత్తులో మానసిక కుంగుబాటు బారినపడే అవకాశాలు చాలా తక్కువని చెప్పారు. కుర్చీలకు అతుక్కుపోయి కూర్చునే అలవాటు ఉన్న పిల్లలను ఈ తీరు మార్చుకునేలా తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలని సూచిస్తున్నారు.