Panchumarthi Anuradha: శ్రీకాకుళం, విశాఖ, విజయనగరంలో ముప్పై తొమ్మిది వేల ఎకరాలను జగన్ కొట్టేశారు: పంచుమర్తి అనురాధ
- తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 10,835 ఎకరాలు
- గుంటూరు, ప్రకాశం, నెల్లూరులో 51,641 ఎకరాలు కొట్టేశారు
- ఈ విషయాల గురించి ఒక్క వైసీపీ నాయకుడూ నోరెత్తడే?
క్రిమినల్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతిపై వైసీపీ నేతలు కచ్చితంగా చర్చకు రావాలని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ డిమాండ్ చేశారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, శ్రీకాకుళం, విశాఖ, విజయనగరంలో ముప్పై తొమ్మిది వేల మూడు వందల తొంభై ఎకరాలను జగన్ కొట్టేశారని ఆరోపించారు.
తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 10,835 ఎకరాలు, గుంటూరు, ప్రకాశం, నెల్లూరులో 51,641 ఎకరాలు కొట్టేశారని, మొత్తం పదహారు కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్ పదహారు నెలలు జైల్లో కూడా ఉన్నారని, ఎనిమిదేళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని, జగన్ కు సంబంధించిన నలభై మూడు వేల కోట్ల రూపాయలను సీబీఐ ఇప్పటికే జప్తు చేసిందంటూ విమర్శల వర్షం కురిపించారు.
ఈ విషయాల గురించి ఒక్క వైసీపీ నాయకుడు కూడా నోరెత్తడని, ఇంత అవినీతి ముఖ్యమంత్రిని పెట్టుకుని తమపై బురదజల్లే ప్రయత్నాలు వైసీపీ నాయకులు ఎందుకు చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. వైసీపీ లాంటిదే టీడీపీ కూడా అనుకోవాలని ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారంటూ ధ్వజమెత్తారు.