Devineni Uma: ఏపీలో ఈ రోజున రెండే రెండు ప్రాజెక్టులు నడుస్తున్నాయంటూ జగన్ పై దేవినేని ఉమ ఫైర్
- ఒకటి సీఎం జగన్ మేనమామ నడిపించే ప్రాజెక్టు
- రెండోది.. జగన్ బంధువు, ఎంపీ బినామీ పేరిట నడుస్తున్న ప్రాజెక్టు
- కడపలో బినామీ పేరిట జగన్ మేనమామ తీసుకున్నారు
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ తీవ్రమైన ఆరోపణలు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఏపీలో ఈరోజున రెండే రెండు ప్రాజెక్టులు నడుస్తున్నాయని, అందులో ఒకటి, సీఎం జగన్ మేనమామ నడిపించే ప్రాజెక్టు, రెండోది.. జగన్ బంధువు, పార్లమెంట్ సభ్యుడి బినామీ పేరిట నడుస్తున్న ప్రాజెక్టు అని ఆరోపించారు.
కడప జిల్లాలో రివర్స్ టెండరింగ్ కు సంబంధించిన కాంట్రాక్టును బినామీ పేరిట జగన్ మేనమామ తీసుకున్నారని, ఆయన తప్ప ఇంకెవరైనా టెండర్ వేశారా? అని ప్రశ్నించారు. పోటీ లేకుండా అందరినీ బెదిరించి ఈ కాంట్రాక్టును దక్కించుకున్నారని ఆరోపించారు. ఇరిగేషన్ డిపార్టు మెంట్ లో ఎవరికి పేమెంట్లు ఇచ్చారు? పదమూడు వేల కోట్ల రూపాయల బడ్జెట్ అని డబ్బా కొట్టారని, ఏ ఏజెన్సీకి ఎంత డబ్బు కేటాయించారు? ఎవరికిచ్చారు? అని ప్రశ్నలు వేసిన దేవినేని, ఈ విషయాలపై స్పష్టత నివ్వాలని జగన్ ని డిమాండ్ చేశారు.