Devineni Uma: శ్రీనివాస్ నివాసంలో దొరికింది రూ.2 లక్షల నగదు, 12 తులాల బంగారం మాత్రమే: దేవినేని ఉమ
- చంద్రబాబు మాజీ పీఎస్ నివాసంలో ఐటీ దాడులపై ఉమ స్పందన
- జగన్ అందరినీ అవినీతిలోకి లాగాలని చూస్తున్నారంటూ ధ్వజం
- దొంగే... దొంగ, దొంగ అన్నట్టుగా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని విమర్శలు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మాజీ ప్రైవేటు సెక్రటరీ శ్రీనివాస్ నివాసంలో ఐటీ దాడుల వ్యవహారం టీడీపీ, వైసీపీ నేతల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధానికి ఆజ్యం పోసింది. దీనిపై టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ ఘాటుగా స్పందించారు. అవినీతిలో కూరుకుపోయిన జగన్ అందరినీ అందులోకి లాగాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో ఐటీ అధికారులు రూ.2 లక్షల నగదు, 12 తులాల బంగారం మాత్రమే గుర్తించారని వెల్లడించారు.
వచ్చే నెలలో శ్రీనివాస్ కుమార్తె వివాహం కూడా ఉందని తెలిపారు. వైసీపీ నేతలు మాట్లాడడం చూస్తే, దొంగే... దొంగ, దొంగ అన్నట్టుగా ఉందని విమర్శించారు. మంత్రులు, ఎంపీలపై ఐటీ దాడులు జరగకుండా ఉండేందుకే జగన్ ఢిల్లీ పర్యటన అని దేవినేని ఉమ ఆరోపించారు. ఐటీ దాడుల నుంచి తన వారిని రక్షించుకునేందుకే జగన్ ఢిల్లీ పరిగెత్తారని ఎద్దేవా చేశారు.