Sajjala Ramakrishna Reddy: పీఎస్ నివాసంలోనే రూ.2 వేల కోట్లు దొరికితే బాబును విచారిస్తే రూ.2 లక్షల కోట్లు బయటపడతాయి: సజ్జల
- ఏపీలో ఐటీ దాడులపై సజ్జల స్పందన
- ఓ చిన్న తీగ లాగితే రూ.2 వేల కోట్లు వచ్చాయని వెల్లడి
- డొంక చాలా పెద్దదని అర్థమవుతోందని వ్యాఖ్యలు
ఏపీలో ఐటీ దాడుల అంశం మరింత రాజుకుంది. ముఖ్యంగా, చంద్రబాబు మాజీ పీఎస్ పెండాల్య శ్రీనివాస్ నివాసంలో ఆరు రోజుల పాటు ఐటీ అధికారులు సోదాలు జరిపిన అంశంపై వైసీపీ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. తాజాగా ఈ అంశంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా స్పందించారు.
ఓ చిన్న తీగ లాగితే రూ.2 వేల కోట్లు బయటికి వచ్చాయని, దీన్నిబట్టే డొంక చాలా పెద్దదని అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. ఓ పీఎస్ వద్దే రూ.2 వేల కోట్ల మేర అక్రమ సంపాదన ఉన్నట్టు వెల్లడైతే, చంద్రబాబును విచారిస్తే రూ.2 లక్షల కోట్లు బయటపడొచ్చని అన్నారు. తన ఐదేళ్ల పాలనలో చంద్రబాబు రాష్ట్రాన్ని దోపిడీ చేసి, ఆ సొమ్మంతా విదేశాల్లో దాచారని ఆరోపించారు. ప్రతిసారి ఆరోపణలు వచ్చినప్పుడు ఆధారాలు చూపించి విచారించుకోవచ్చనే చంద్రబాబు ఈసారి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.