Lakshmi Parvati: చంద్రబాబుపై లక్ష్మీపార్వతి వేసిన కేసులో 26న ఉత్తర్వులిస్తామన్న ఏసీబీ కోర్టు!
- 2005లో దాఖలైన కేసు
- అప్పట్లోనే స్టే తెచ్చుకున్న చంద్రబాబు
- సుప్రీం మార్గదర్శకాలతో ముందుకు సాగనున్న విచారణ!
చంద్రబాబునాయుడు అక్రమంగా ఆస్తులను కూడబెట్టారంటూ, దీనిపై ఏసీబీ విచారణకు ఆదేశాలు ఇవ్వాలంటూ 2005లో దివంగత ఎన్టీఆర్ భార్య లక్ష్మీ పార్వతి వేసిన కేసులో ఈ నెల 26న తగిన ఉత్తర్వులు ఇస్తామని ఏసీబీ కోర్టు పేర్కొంది. ఈ కేసును ఇప్పటికే చాలా కాలం వాయిదాలు వేస్తూ వచ్చారని, ఇకపై చంద్రబాబు తరఫున వాదనలు వినకుండా, తదుపరి ఉత్తర్వులు ఇవ్వాలని లక్ష్మీపార్వతి తరఫు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేయగా, కోర్టు ఆమోదించింది.
కాగా, ఈ కేసు దాఖలైన సమయంలో చంద్రబాబు హైకోర్టు నుంచి స్టే పొందడంతో విచారణ ఆగిపోయింది. ఆపై గత సంవత్సరం సుప్రీంకోర్టు ఇలాంటి కేసులపై మార్గదర్శకాలు జారీ చేస్తూ.. మధ్యంతర స్టే ఉత్తర్వుల గడువు ఆరు నెలలేనని తేల్చి చెప్పింది. ఆపై స్టే ఆదేశాలు కొనసాగిస్తూ, ఉత్తర్వులు ఇవ్వకుంటే, అది రద్దయినట్టేనని స్పష్టం చేసింది. ఇక సుప్రీంకోర్టు తీర్పును ఉటంకిస్తూ, చంద్రబాబుపై దర్యాఫ్తునకు ఆదేశాలు జారీ చేయాలని లక్ష్మీపార్వతి కోరారు. దీనిపై స్టే ఉత్తర్వులను తెప్పించుకుని పరిశీలించి తదుపరి ఆదేశాలు జారీ చేస్తామని చెబుతూ, కేసు విచారణను ఏసీబీ కోర్టు న్యాయమూర్తి వాయిదా వేశారు.