Crime News: అదే శాశ్వత నిద్ర అయ్యింది...వాహనంపై నుంచి జారిపడి వ్యక్తి మృతి!
- బాధితుడు బ్యాండ్ పార్టీ సభ్యుడు
- వరుస పోగ్రాంలతో నిద్రలేక అలసిన శరీరం
- మినీవ్యాన్ పైన కూర్చుని ప్రయాణిస్తుండగా ఘటన
నిద్ర మనిషికి, మనసుకు విశ్రాంతి నిచ్చే సాధనం. శరీరం అనే ఇంజిన్ రీచార్జి అయి మరింత ఉత్సాహంగా పనిచేయాలంటే తగినంత నిద్ర తప్పనిసరి. ఆ నిద్ర కరవవ్వడం ఓ వ్యక్తి ప్రాణాల మీదికి తెచ్చింది. వాహనం పైన కూర్చుని ప్రయాణిస్తూ నిద్రమత్తులో జారి పడడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. కుటుంబ సభ్యులకు తీవ్ర విషాదం మిగిల్చాడు.
పశ్చిమగోదావరి జల్లా భీమడోలు మండల కేంద్రం సమీపంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి. నల్లజర్ల మండలం తెలికిచర్ల గ్రామానికి చెందిన మాచర్ల ఏసు (32) ఓ బ్రాండు ట్రూపులో సభ్యుడు. ఇటీవల వరుసగా ముహూర్తాలు ఉండడంతో విశ్రాంతి లేకుండా బృందం సభ్యులతోపాటు తిరుగుతున్నాడు.
గురువారం రాత్రి ద్వారకా తిరుమలలో జరిగిన ఓ వివాహ కార్యక్రమంలో వీరి బృందం బ్యాండు వాయించింది. పశ్చిమగోదావరి జిల్లా పెదతాడేపల్లిలో మరో వివాహానికి ఒప్పందం ఉండడంతో నిన్న తెల్లవారు జామున మినీవ్యాన్లో బృందం సభ్యులంతా బయుదేరారు. వాహనంపైన ఏసు కూర్చున్నాడు. వాహనం పూళ్ల దాటిన తర్వాత కోడూరుపాడు పెట్రోలుబంకు పరిధిలోకి వచ్చేసరికి నిద్రమత్తులో వాహనంపై నుంచి జారిపడి అక్కడికక్కడే చనిపోయాడు.
కానీ వ్యాన్లో ఉన్న బృందం సభ్యులు ఈ విషయాన్ని గమనించకుండా వెళ్లిపోయారు. పెట్రోలింగ్ పోలీసులు మృతదేహాన్ని గుర్తించి, అతని జేబులోని సెల్ఫోన్ ద్వారా బృందం సభ్యులకు ఫోన్ చేసి తెలియజేయడంతో వారు గతుక్కుమన్నారు. మృతుడి భార్య మాచర్ల భాను పోలీసులకు ఫిర్యాదు చేశారు.