Avanthi Srinivas: చంద్రబాబు, లోకేశ్ ల పాస్ పోర్ట్స్ ను తక్షణమే సీజ్ చేయాలి: కేంద్రానికి మంత్రి అవంతి వినతి
- గత ఐదేళ్లలో టీడీపీ నేతలు విచ్చల విడిగా దోచుకున్నారు
- మాజీ పీఎస్ శ్రీనివాస్ ను విచారిస్తేనే కోట్ల రూపాయలు దొరికాయి
- ఇక చంద్రబాబు, లోకేశ్ లను విచారిస్తే ఎన్ని కోట్లు దొరుకుతాయో?
మాజీ పీఎస్ శ్రీనివాస్ ను ఐటీ అధికారులు విచారిస్తే రెండు వేల కోట్ల రూపాయలకు పైగా దొరికాయంటే, చంద్రబాబును, ఆయన బినామీలను, లోకేశ్ ను విచారిస్తే ఎన్ని కోట్ల రూపాయలు దొరుకుతాయోనంటూ ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ అనుమానం వ్యక్తం చేశారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ఐదేళ్లలో కొన్ని లక్షల కోట్ల రూపాయలను టీడీపీ నేతలు విచ్చల విడిగా దోపిడీ చేశారని ఆరోపించారు.
చంద్రబాబు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతి గురించి నాడు మోదీకి తెలియడం వల్లే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు నాడు రాలేదని ఆరోపించారు. మొన్న ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు బుద్ధి చెప్పినా ఆ పార్టీ నేతల్లో మార్పు రాలేదని, జగన్ ని, వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో ఏ నాయకుడు చేయని విధంగా టీడీపీ హయాంలో చంద్రబాబు ఎన్నో అక్రమాలు, అవినీతి కార్యక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. చంద్రబాబు, లోకేశ్ లను విచారించాలని, వారి పాస్ పోర్టులను సీజ్ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నిందితులు ఎంత పెద్ద వారైనా సరే వారిని శిక్షించాలని కోరారు.